‘మైనే ప్యార్ కియా’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం నమోదు చేసింది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ సుమన్ పాత్రలో నటించింది. ఈ సినిమాతో భాగ్యశ్రీకి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ తనను ఎలా ఆటపట్టించారనేది తెలిపారు.
ఆ సినిమా నాటికే హిమాలయ దాసానితో భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారు. “మైనేప్యార్ కియా’ చిత్రీకరణ వల్ల సల్మాన్‌తో మంచి స్నేహం ఏర్పడింది. చిత్రీకరణ సమయంలో ఓసారి సల్మాన్ నా పక్కనే కూర్చొని చెవిలో లవ్ సాంగ్ పాడారు. అంతేకాకుండా ఆ రోజంతా నా వెంట పడటంతో ఆయన ప్రవర్తన నాకసలు అర్థం కాలేదు. ఆయన నన్ను ఆట పట్టిస్తున్నారనుకున్నా.
కానీ ఆయన ప్రవర్తన మరింత హద్దులు దాటింది. దీంతో ఎందుకిలా చేస్తున్నారంటూ కోప్పడ్డాను. అప్పుడు నా ప్రేమ విషయం తనకు తెలుసని.. హిమాలయ గురించి కూడా తెలుసని.. ఆయనను ఒకసారి సెట్స్‌కి పిలవొచ్చు కదా అనడంతో అసలు నా లవ్ స్టోరీ ఆయనకెలా తెలిసిందా? అని ఆశ్చర్యపోయాను. సల్మాన్ ఎందుకలా ప్రవర్తించారో అప్పుడు అర్థమైంది” అని పేర్కొన్నారు.