12-04-2025 12:00:00 AM
జోరుగా నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలు
ఇతర రాష్ట్రాల్లో నుంచి దిగుమతి
ఏజెంట్ల ద్వారా అమ్మకాలు
కోట్ల రూపాయల దందా
నష్టపోతున్న అన్నదాతలు
పట్టించుకోని జిల్లా యంత్రాంగం
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్11 ( విజ యక్రాంతి): దేశానికి వెన్నెముకగా నిలుస్తు న్న అన్నదాతలకు అడుగడుగునా అవంతరాలు రావడం తప్ప వేరే మార్గం లేకుండా పోతుంది. అధికార యంత్రం నిఘా వైఫ ల్యం కారణంగా అమాయకమైన రైతులు నకిలీ పత్తి విత్తనాల బారిన పడుతున్నారు. ప్రతి ప్రతి ఏటా జిల్లాలో టన్నులకొద్దీ నకిలీ పత్తి విత్తనాలు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని అక్రమార్కులు ఏజెంట్లను నియమించి రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారు. దీంతోపాటు నిషేధిత గడ్డి మందును సైతం విక్రయిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే జిల్లాలో ఇప్పటికే నకిలీ పత్తి విత్తనాలు అమ్మకాలు జోరందుకున్నాయి.
టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం రావడంతో ఇటీవల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన చేసుకున్న సంఘటన నెలకొంది తద్వారా జిల్లాలోని అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. నకిలీ దందాకు బడా నాయకుల అండదండలు ఉండడంతోనే అక్రమార్కులు యదేచ్చగా ఈ దందాను కొనసాగిస్తున్నారని చర్చ జరుగుతుంది. బడా నాయకుల అండదండలతో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని అధికారులు చూసి చూడనట్టు వివరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి
మహారాష్ట్ర ,ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల నుండి నకిలీ పత్తి విత్తనాలను గుట్టు చప్పుడు కాకుండా దిగుమతి చేసుకొని పత్తి విత్తనాలను రైతులకు అంటగట్టుతున్నారు. ముందస్తుగానే నియమించు కున్న ఏజెంట్ల ద్వారా అమ్మకాలు జరుగుతుండడంతో బయటకు పొక్కడం లేదు. రైతులకు నమ్మకంగా ఉండే వ్యక్తులను ఏజెంట్లుగా నియమించుకొని గత రెండు నెలల ముందుగానే రైతుల నుండి ఆర్డర్లు తీసుకున్నట్లు సమాచారం.
నష్టపోతున్న అన్నదాతలు
అక్రమ ధనార్జనే లక్ష్యంగా దళారులు చేస్తున్న నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలలో రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ప్రతి ఏటా పంట సాగు కోసం తమకు తెలిసిన వారి వద్ద వడ్డీకి తీసుకువచ్చి వ్యవసాయం చేస్తున్నారు. పేద రైతుల వద్ద సమయానికి డబ్బు లేకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సి న పరిస్థితి నెలకొంది. ఇదే అదనుగా చేసుకున్న అక్రమ వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. జిల్లాలోని జైనూర్, లింగాపూర్, సిర్పూర్ యు, తీర్యాని, కెరమెరి, వాంకిడి, కౌటాల, చింతలమానపల్లి, పెంచికల్పేట్ ,బెజ్జూర్ మండలాల్లో నకిలీ విత్తనాల సరఫరా జోరుగా సాగుతుంది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాలలో కొం తమంది వ్యాపారులు నకిలీ పత్తి విత్తనాల సరఫరాలో నిమగ్నం అయ్యారు.
సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ,షాపులను నిర్వహిస్తూనే వ్యాపారులు నకిలీ పత్తి విత్తనాల అమ్మకాలతో పాటు నిషేధిత గడ్డి మందును సైతం అమ్ముతుండడం గమర్హనం.వ్యవసాయ అధికారులు మాత్రం అడపా దడపా విత్తనాల షాపులను తనిఖీలు చేస్తూ హడావిడి చేస్తుంటారు.అక్రమ దందా చేసేవారు ఎవరైనా బహిరంగంగా షాపులో పెట్టి అమ్ముతారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. నిఘా వ్యవస్థ వైఫల్యం తోనే అక్రమార్కుల దందా జోరుగా కొనసాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో అక్రమంగా పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు అధికారులకు తెలిసినప్పటికీ బడా నాయకుల ఒత్తిడితో చూసి చూడనట్లు మామూలు గా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు లేకపోలేదు.
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
ఈనెల 4న చింతలమానపల్లి మండలం లో రూ:10.50 లక్షల విలువ చేసే 300 కిలోల నకిలీ పత్తి విత్తనాలను అసిఫాబాద్ మండలం బూరుగుడా గ్రామానికి చెందిన లోకండే బిక్షపతి వద్ద పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. 9న కాగజ్‌నగర్ పట్టణంలో ని నవత ట్రాన్స్పోర్ట్‌లో రూ: 1.57 లక్షల విలువచేసే 45 కిలోల నకిలీ పత్తి విత్తనాల ను విజయవాడ నుండి దిగుమతి చేసుకొని సరఫరాకు సిద్ధంగా ఉన్న వాటిని పోలీసులు స్వాధీన పరచుకునీ బెజ్జూర్‌కు చెందిన చంద్రశేఖర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నిద్రావస్థలో అధికార యంత్రాంగం..
ప్రతి ఏటా నకిలీ పత్తి విత్తనాల విక్రయాలు జరుగుతున్నప్పటికీ అధికారి యంత్రాంగం ముందస్తుగా రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ మాసంలో జిల్లాలో వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్రమార్కులు రెండు, మూడు నెలల ముం దుగానే రంగంలోకి దిగి తమ పనిని కానించుకుంటున్నారు. రైతు వరకు నకి లీ పత్తి విత్తనాలు చేరిన తర్వాత టాస్క్ ఫోర్స్ కమిటీ, సంబంధిత అధికారులు ఐరానా చేస్తూ నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేయవద్దని, రసీదులు తప్పకుండా తీసుకోవాలని హడావిడి చేస్తూ ఉంటారు. అప్పటికే రైతులు డబ్బు వెచ్చించి విత్తనాలను కొనుగోలు చేశాక అవి ఏం చేయాలో అర్థం కాక తప్పనిసరి పరిస్థితుల్లో విత్తనాలను నాటుతు న్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో అక్రమార్కులది ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుంది.చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా జిల్లాలోని అధికారుల తీరు కండ్లకు కనిపిస్తుంది. రైతులకు దళారులు అమ్ముతున్న విత్తనాలు నకిలీవో, అసలీవో తెలియక నష్టపోతున్నారు.
నకిలీ పత్తి విత్తనాలపై నిఘా పెంచాం
నిషేధిత పత్తి విత్తనాల అమ్మకాలపై ప్రత్యేకంగా నిగాపించడం జరిగింది. నకిలీ విత్తనాల సరఫరా జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాం. రైతులు లూసు, రషీద్ లేని విత్తనాలు కొనుగోలు చేయకూడదు. ఎవరైనా గ్రామాలలో పత్తి విత్తనాలు అమ్మకానికి తీసుకువస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుంది. నకిలీ విత్తనాల రవాణా, అమ్మకాలు జరగకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇప్పటివరకు 345 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీన పరచుకోవడంతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం.
-డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ,అసిఫాబాద్.