న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశంలో జింక్, వెండి లోహాల ఉత్పత్తిలో టాప్ కంపెనీ అయిన హిందుస్థాన్ జింక్‌లో కేంద్ర ప్రభుత్వం తనకున్న వాటాలో 1.6 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఖజానాకు రూ. 3,448 కోట్లు సమకూరింది. హింద్ జింక్‌లో వాటా అమ్మకానికి ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్)ను నవంబర్ 6,7 తేదీల్లో జారీచేసింది. గ్రీన్‌షూ ఆప్షన్‌తో పాటు మొత్తం 2.5 శాతం వాటాను విక్రయానికి ఉంచగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,400 కోట్ల విలువైన బిడ్స్‌ను సమర్పించారు.
రిటైల్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్‌చేసిన షేర్లకు పెద్దగా డిమాండ్ లభించలేదు. దీంతో 1.6 శాతం వాటానే విక్రయించగలిగింది. వేదాంత గ్రూప్ సంస్థ అయిన హింద్ జింక్‌లో తాజా ఓఎఫ్‌ఎస్ జారీచేయకముందు కేంద్ర ప్రభుత్వానికి 29.54 శాతం మైనారిటీ వాటా ఉన్నది. తాజా నిధుల సమీకరణతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సేకరించిన నిధుల మొత్తం రూ. 8,625 కోట్లకు చేరింది. కొద్దినెలల క్రితం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఓఎఫ్‌ఎస్‌తో రూ. 2,346 కోట్లు, కొచ్చిన్ షిప్‌యార్డ్ ఆఫర్‌తో రూ. 2,015 కోట్లు సమీకరించింది. మరో రూ .815 కోట్లు ఎస్‌యూయూటీఐ రెమిటెన్సుల ద్వారా సమకూరింది.