calender_icon.png 15 January, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.2,443 కోట్ల అల్ట్రా లగ్జరీ ఇండ్ల విక్రయం

06-09-2024 12:00:00 AM

అనరాక్ రిపోర్ట్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: ఈ ఏడాది జనవ రి నుంచి ఆగస్టు మధ్యకాలంలో దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో రూ.2,443 కోట్ల విలువైన 25 అల్ట్రాలగ్జరీ ఇండ్లు విక్రయమైనట్టు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ తాజా రిపోర్ట్‌లో తెలిపింది. ప్రస్తుత ఏడాది తొలి ఎనిమిది నెలల్లో ముంబై, హైదరాబాద్, గురుగ్రామ్, బెంగళూరుల్లో ఈ అమ్మకాలు జరిగినట్టు అనరాక్ పేర్కొంది.  రూ.40 కోట్లుపైబడి విలువ కలిగిన గృహాన్ని అల్ట్రాలగ్జరీగా పరిగణిస్తారు.

పూనె, చెన్నై, కోల్‌కతాల్లో ఈ ధరలో ఎటువంటి ఇండ్ల అమ్మకాలు జరగలేదని వెల్లడించింది. 2023 సంవత్సరం మొత్తంమీద ముంబై, హైదరాబాద్, గుర్‌గావ్, బెంగళూరుల్లో రూ.4,556 కోట్ల విలువైన 61 అల్ట్రాలగ్జరీ ఇండ్ల విక్రయ లావాదేవీలు జరిగాయని, ఈ ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ పండుగ త్రైమాసికం అయినందున, ఇటువంటి పెద్ద రెసిడెన్షియల్ లావాదేవీల్ని చూస్తామని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి చెప్పారు.

ఈ ఏడాది ఇప్పటివరకూ జరిగిన 25 అల్ట్రాలగ్జరీ డీల్స్‌లో రూ.1,694 కోట్ల విలువైన 20 హైరైజ్ అపార్ట్‌మెంట్స్‌కాగా, మిగిలినవి రూ. 748 కోట్ల విలువైన 5 బంగళాలు. నగరాల వారీగా చూస్తే ముంబైలో అధికంగా రూ. 2,200 కోట్ల విలువైన 21 డీల్స్ నమోదయ్యాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిస రాల్లో రూ.80 కోట్ల విలువైన రెండు అల్ట్రాలగ్జరీ హోమ్ డీల్స్ జరిగాయి. ఎన్‌సీఆర్ లోని గురుగ్రామ్‌లో రూ.95 కోట్ల విలువైన ఒక డీల్, బెంగళూరులో రూ.67 కోట్ల డీల్ ఒకటి జరిగినట్లు అనరాక్ తెలిపింది.