రూ.395 ఫ్లోర్ ధరతో నేడు ఆఫర్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కేంద్ర ప్రభుత్వం జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ)లో 6.7 శాతం వాటాను మార్కెట్లో విక్రయించడానికి ఆఫర్ ఫర్ సేల్‌ను (ఓఎఫ్‌ఎస్) సెప్టెంబర్ 4న ప్రారంభిస్తుంది. ఒక్కో షేరుకు రూ. 395 చొప్పున ఫ్లోర్ ధరను నిర్ణయించింది. సంస్థాగత ఇన్వెస్టర్లకు ఓఎఫ్‌ఎస్ బుధవారం ఓపెన్ అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లు గురువారం ఆఫర్‌లో బిడ్ చేసుకోవచ్చని దీపం కార్యదర్శి తుహిన్‌కాంత్ పాండే ఎక్స్ పోస్టు లో తెలిపారు.
ఫ్లోర్ ధర రూ.395 ప్రకారం 11.90 కోట్ల షేర్ల (6.78 శాతం) విక్రయం ద్వారా ప్రభుత్వానికి రూ. 4,700 కోట్లు సమకూరుతుంది. మంగళవారం బీఎస్‌ఈ లో జీఐసీ షేరు ధర రూ.421 వద్ద ముగిసింది. జీఐసీలో ప్రస్తుతం కేంద్రానికి 85.78 శాతం వాటా ఉన్నది. 2017 అక్టోబర్‌లో జారీఅయిన జీఐసీ ఐపీవో ద్వారా ప్రభుత్వం రూ. 9,685 కోట్లు సమీకరించింది.