మెట్రో బాధ్యతల నుంచి తప్పుకుంటాం
ఓ టీవీ చానల్‌తో జరిగిన ఇంటర్వ్యూలో.. ఎల్ అండి టి ప్రెసిడెంట్ శంకర్ రామన్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల వేడి చల్లారగానే మెట్రో రైలు బాధ్యతల నుంచి ఎల్ అండ్ టి తప్పుకుంటుందనే వార్తలు వివాదస్పదంగా మారా యి. ఈ వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు తాజాగా ఎల్ అండి టి ప్రెసిడెంట్ శంకర్ రామన్ చేసిన వ్యాఖ్యలతో మరింత హీటెక్కింది. దీంతో హైదరాబాద్‌కు మణిహారంగా భావిస్తున్న మెట్రో ఇక నగర ప్రజలకు అందుబాటులో ఉంటుందా లేదా అనే అంశం చర్చనీయాశంగా మారింది.
పార్లమెంటు ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో మెట్రో బాధ్యతల నుంచి ఎల్ అండ్ టి తప్పుకుం టుందట అనే ప్రశ్నకు సమాధానంగా అమ్ముకుంటే అమ్ముకోని అనే వ్యాఖ్యలు చేయడంతో ఈ టాపిక్ వివాదస్పదమైంది. తాజాగా సీఎం వ్యాఖ్య లకు సమాధానంగా అన్నట్టుగా శుక్రవారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్ అండ్ టి ప్రెసిడెంట్ వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రో రైలు ఆదాయానికి గండి పడు తున్నట్టు ఆయన చెప్పారు.
ఇలాంటి పరిస్థితిలో మెట్రో నిర్వహణ ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. 2026 తర్వాత మెట్రో విక్రయానికి సంబంధించిన ప్రకటన ఉంటుందని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో మెట్రో నిర్వహణ నుంచి ఎల్ అండ్ టి తప్పుకునే విషయంపై స్పష్టత వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మహాలక్ష్మీ పథకం వల్ల ఆర్టీసీ కూడా దివాళా తీస్తుందని ఆయన ప్రకటన చేయడం విశేషం. అయితే, ఈ స్టేట్‌మెంట్‌తో రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మరి.