calender_icon.png 19 March, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా కల్తీ కల్లు విక్రయం

18-03-2025 12:29:07 AM

  1. ‘మాములు‘ గానే తీసుకుంటున్న ఆబ్కారి శాఖ
  2. మత్తు మాయతో ప్రజల ప్రాణాలకు ముప్పు
  3.  ధనార్జనే ధ్యేయంగా  కల్తీ తయారు
  4. తనిఖీలు చేపట్టని అధికార యంత్రాంగం
  5. కల్లు దుకాణాలపై నిఘా కరువు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే సాక్షాలతో సహా  పట్టుకోవచ్చు

పెబ్బేరు, మార్చి 17:  పెబ్బేరు, శ్రీరంగాపూర్ ఉమ్మడి మండలంలో కల్తీకల్లు కోరలు చాస్తుంది. కాసుల కక్కుర్తితో కొందరు అక్రమార్కులు తయారు చేస్తున్న మత్తు మాయ తో ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. గత నెలలో  ఒక మండలంలో ఒక కల్లు దుకాణంపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి మండలంలో ఇరువర్గాల మధ్య అధిపత్యపోరు కారణంగా అక్రమ దందా తీరు పూర్తిగా బహిర్గతమవుతుంది.

అబ్కారి శాఖ అధికారుల అండదండలతో పెబ్బేరు మండలం కొత్త సుగూర్, బూడిదపాడు, జనంపల్లి గ్రామాలలో అనుమతి లేకుండా విచ్చల విడిగా కల్లు విక్రయాలు కొనసాగుతున్నాయని ఒకరిపై ఒకరు పిర్యాదు చేసుకున్నారని విశ్వాసనీయ సమాచారం. స్వచ్ఛమైన చెట్టు కల్లు విక్రయం అరకొరగానే ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మండలంలో టీఎఫ్టీ(ట్రీ ఫర్ ట్యాఫర్) 31, టీసీఎస్(కల్లు సహకార సంఘం) 8 అనుమతులు పొందారు.

నిబంధనలకు నీళ్లు

నిబంధన ప్రకారం చెట్టు నుంచి సేకరించిన కళ్ళు మాత్రమే విక్రయించాలి. ఈత కళ్ళు విక్రయిస్తున్నామని ఆబ్కారి శాఖ నుంచి లైసెన్సులు పొందుతున్న వ్యాపారులు కల్తే తయారు చేసి లక్షలకు పడగలెత్తుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం చెట్టు ఎక్కి కల్లు గిసే కార్మికులకే లైసెన్స్ లు ఇవ్వాలి కానీ గతంలో ఆబ్కారి శాఖ అధికారులు నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా లైసెన్స్ లు జారీ చేశారని గీత కార్మికులు ఆరోపిస్తున్నారు. డైజోఫాం, ఆల్ఫా జోలం, క్లోరో హైడ్రేట్, క్లోరోఫామ్(మత్తుకు) సాక్రీన్ (రుచికి) తెల్ల పౌడర్(చిక్కదనానికి) నీళ్లలో కలిపి రోజు వందల లీటర్లు తయారు చేస్తున్నారు కొందరు. దీని తాగిన పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

జోరుగా విక్రయాలు

 కృత్రిమంగా రసాయనలతో తయారు చేసిన కల్తీకల్లు సీసా రూ.10 నుంచి 15 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీనిని తాగిన వారు మత్తుకు బానిసలు అవుతున్నారు. ఉమ్మడి మండలంలోని వివిధ గ్రామపంచాయతీలో సొసైటీల పేరిట విక్రయిస్తున్నారు. ఈ విషయం ఆబ్కారి శాఖ అధికారులకు తెలిసిన కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధన ప్రకారం డిపోల నుంచి నమూనాల సేకరించి ల్యాబ్ కు పంపి  రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్లు నిర్ధారణ అయితే దుకాణ నిర్వాహకుడి లైసెన్సు రద్దు చేయాలి. 

అధిక మోతాదుతో రోగాలు

 రసాయన పదార్థాలను ఇతర ప్రాంతాల నుంచి రహస్యంగా తీసుకొచ్చి వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోతాదుకు మించి తాగితే మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారని వైద్యులు చెబుతున్నారు. గతంలో అనేకమంది మానసిక సమస్యలు ఎదుర్కొని ఆస్పత్రుల పాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. కొందరు కళ్ళు తయారీదారులు కొన్ని సందర్భాల్లో మత్తు పదార్థాలు కూడా కలుపుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివలన గ్యాస్ ట్రబుల్ కడుపులో మంట కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 

చెట్టు కల్లే ఆరోగ్యాదాయకం

చెట్టుకల్లు ఆరోగ్యదాయకం కావడంతో ప్రభుత్వం గీత కార్మిక వృత్తికి కుటీర పరిశ్రమ హోదా ఇచ్చింది. ఇందులో భాగంగా రెండు రకాల అనుమతులు జారీ చేస్తుంది. మొదటిది టిఎఫ్టి (ట్రీ ఫర్ ట్యాపర్) గీత కార్మికులు సొంతంగా కళ్ళు గీసి విక్రయించుకోవచ్చు. రెండోది టీసిఎస్ (కల్లు సహకార సంఘం) కార్మికులంతా సంఘంగా ఏర్పడి అమ్మకాలు జరపడం లాభనష్టాలు వారే భరించాలి. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే దొంగ చాటుగా విక్రయిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

కల్లు దుకాణాలపై నిఘా కరువు

ఉమ్మడి మండలంలో కల్లు దుకాణాలపై ఎక్సైజ్ శాఖ నిఘా కరువవుతోంది. ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాల అధికారులు కల్లు దుకాణాలలో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నా ‘మాములు’గానే తీసుకుంటు న్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ నిఘా విభాగం అధికారులు దాడులు చేస్తున్న సమయంలో కల్లు దుకాణాల్లో క్లోరోహైడ్రేట్, అల్ఫాజోలం వంటి మత్తు పదార్థాలు లభ్యమవుతుండడం స్థానిక సర్కిల్ ఎక్సైజ్ పోలీసుల పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఇప్పటికైనా ఎక్సైజ్ ఉన్నతాధికారులు సర్కిల్ కార్యాలయాల అధికారులను, సిబ్బందిని అలర్ట్ చేసి కల్లు దుకాణాలపై ఎ ప్పటికప్పుడు దాడులు చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బహిరంగంగా సాగుతున్న జిల్లా ఆబ్కారి శాఖ అధికారులు చూసి చూడనట్టు ఉండటం విమర్శలకు తావిస్తుంది. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే సాక్షాలతో సహా పట్టుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. గత నెలలో పెబ్బేరు మండలంలో కల్తీ కల్లు తయారీ దారులపై కేసులు నమోదు చేశాం.  జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా తనిఖీలు చెపడుతాం. కల్తీ కల్లు విక్రయంపై పిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

 బి. శ్రీనివాసులు.ఆబ్కారి శాఖ అధికారి, వనపర్తి జిల్లా.