calender_icon.png 6 October, 2024 | 4:11 AM

బల్దియాలో జీతాల కటకట

05-10-2024 12:19:04 AM

ఉద్యోగులకు దసరా నెలలోనూ అందని వేతనాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో దసరా అతి పెద్ద పండుగ. ఏ పండుగ ఎలా జరుపుకున్నా.. దసరా పండుగకు మాత్రం కుటుం బం అంతా ఎంతో సరదాగా గడుపుతారు. ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీలు, వ్యాపారులు, ఇతరత్రా పెద్ద వాళ్లంతా.. తమ దగ్గర పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది పండుగ మంచి గా జరుపుకోవాలని ఈనెలలో జీతంతో పాటు బోనస్ (పండుగ ప్రోత్సాహక నగదు) కూడా ఇస్తుంటారు.

ఇంతటి ప్రాధాన్యత కలిగిన దసరా పండుగ (అక్టోబర్) నెలలో బల్దియా ఉద్యోగులు, సిబ్బందికి ఇప్పటికీ వేతనాలు జమ కాకపోవడంపై వారు పెదవి విరుస్తున్నారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా సుమారు 34 వేల ఉద్యోగులు ఉండగా వీరిలో పర్మినెంట్ ఉద్యోగులు దాదాపు 3,500 మంది ఉంటారు. వీరందరినీ కలుపుకుని ప్రతినెలా సుమారు రూ.136 కోట్ల వరకూ బల్దియా వేతనాలకు ఖర్చు చేస్తోంది.

ప్రస్తుతం ఆర్థికంగా తీవ్రమైన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న బల్దియాకు ప్రాపర్టీ టాక్స్ తప్పా మరే ఇతర ఆదాయమార్గం కన్పించడం లేదు. దీనికితోడు బల్దియా పలు ప్రాజెక్టుల నిమిత్తం చేసిన సుమారు రూ.6500 కోట్ల అప్పులకు సంబంధించి ప్రతినెలా అసలు, వడ్డీతో పాటు రూ.100 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొంతకాలంగా ప్రతినెలా ఉద్యోగులు, సిబ్బందికి వేతనాలు జమ చేయడానికి బల్దియా అనేక అవస్థలు పడాల్సి వస్తోంది.