calender_icon.png 19 April, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేతనం ఫిక్స్ చేయాలి

11-12-2024 01:48:46 AM

  1.  ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలతోపాటు
  2. పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
  3. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే నిర్ణయించాలి 
  4. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ డిమాండ్
  5. కోఠిలో ఆశా కార్యకర్తల భారీ ధర్నా 

2023 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె సందర్భంగా అప్పటి హెల్త్ డైరెక్టర్ ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆశా కార్యకర్తల వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరోగ్య శాఖ కమిషనర్‌తో జరిగిన చర్చల్లో భాగంగా రూ.50 లక్షల ఇన్సూరెన్స్, ఖర్చుల నిమిత్తం రూ.50 వేలతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ కమిషనర్ గతంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి.

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): ప్రస్తుత శీతాకాల అసెంబ్లీ సమావేశంలోనే ఆశా కార్యకర్తలకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం చెల్లించేందుకు నిర్ణయించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెం కటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.18 వేలతోపాటు పీఎఫ్, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ ధర్నా నిర్వహిం చారు.

ఈ కార్యక్రమానికి ఆశా కార్యకర్తల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పీ జయలక్ష్మిఅధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. 2023 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మె సందర్భంగా అప్పటి హెల్త్ డైరెక్టర్ ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఆశాల వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరోగ్య శాఖ కమిషనర్‌తో జరిగిన చర్చల్లో భాగంగా రూ.50 లక్షల ఇన్సూరెన్స్, ఖర్చుల నిమిత్తం రూ.50 వేలతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

ప్రభుత్వం, ఆరోగ్య శాఖ కమిషనర్ గతంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నా రు. తెలంగాణ ఆశా కార్యకర్తల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి మాట్లాడుతూ.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలనీ, ఆశాలకు ఇస్తున్న వేతనంలో సగం పింఛన్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం ట్రైనింగ్ పూర్తయిన ఆశాలకు ఏఎన్‌ఎం, జేఎన్‌ఎం పోస్టుల్లో ప్రమోషన్స్ కల్పించాలని కోరారు. 2021 జూలై నుంచి చెల్లించాల్సిన 6 నెలల పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు.

అనంతరం ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌తో జరిగిన చర్చల్లో ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అంతకంటే ముం దు జాయింట్ డైరెక్టర్ రాజేశం, కృష్ణవేణిలు ధర్నా వద్దకు వచ్చి ఆశాల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ధర్నాలో యూని యన్ నాయకులు నీలాదేవి, పద్మ, యాద మ్మ, సునిత, బుచ్చమ్మ, సాధన, కళావతి, బాలమణి, ధనలక్ష్మి, మహేశ్వరి, వరలక్ష్మి, ప్రవీణ, మంగ తదితరులు పాల్గొన్నారు. 

ఆశాల విధులు ఇలా..

* సీజనల్ వ్యాధులు, అక్షరాస్యత అంశాలపై సర్వేతో టీబీ కేసులను గుర్తించడం, టీబీ కిట్లను పేషెంట్లకు అందజేయడం 

* ప్రభుత్వం నుంచి ఏ కొత్త పథకం వచ్చినా సర్వే చేపట్టడం, ఆ పథకంలో భాగస్వామ్యమై పనిచేయడం 

* ఇంటింటికి తిరిగి పెళ్లి అయిన కొత్త జం టలను గుర్తించి నమోదు చేసుకోవాలి 

* గర్భిణులను గుర్తించడం, వారికి ప్రతివారం చెకప్‌ను ఫాలోఅప్ చేయడం, మందుల పంపిణీ, సక్రమంగా టీకాలు వేయడం, ముందస్తు జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించడం, ప్రభుత్వ దవాఖానాల్లోనే ప్రసవం అయ్యేలా అవగాహన కల్పించడం 

* పరిసరాలలో దోమల వ్యాప్తి నివారణకు ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రై డే పాటించేలా చూడటం 

* ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పీహెచ్‌సీ కేంద్రాలలో విధులు. 

* ప్రభుత్వం నిర్వహించే పలు పరీక్షా కేంద్రాల వద్ద, జాతరలు, ఉత్సవాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం 

* 104, 108 విధులతోపాటు హెల్త్ సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లినప్పుడు వాట్సాప్ ద్వారా ఫొటోలు తీసి అధికారులకు పంపడం. 

ఆశా వర్కర్ల మీద దాష్టీకం : ఎమ్మెల్సీ కవిత

ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశా వర్కర్లను గౌరవంగా ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడి వారి వేతనాలను పెంచారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారని పేర్కొన్నారు. ఒకపక్క పేద తల్లి విగ్రహాన్ని పెట్టామని చెబుతున్న ముఖ్యమంత్రి ఆశా వర్కర్ల మీద చేస్తున్న దాష్టీకాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఆశాల సమస్యలపై అసెంబ్లీలో కొడ్లాడతాం: కేటీఆర్

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.18వేల వేతనం ఇవ్వాలని  డిమాండ్ చేస్తూ సోమవారం ఆశా వర్కర్లు చేపట్టిన ధర్నాలో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ధర్నా సందర్భంగా పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆశవర్కర్లు..

రహీంబీ, సంతోషను మంగళవారం కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఓపీ బ్లాక్ ఎదుట విలేకరులతో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆశ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వారి తరఫున అసెంబ్లీలో తాము కొట్లాడుతామని స్పష్టం చేశారు. ఘటన జరిగి 24గంటలు గడుస్తున్నా ఈ విషయమై సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. కరోనా సమయంలోనూ ఆశాలు వారి ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందించారని గుర్తుచేశారు.

అలాంటి ఆడబిడ్డలపై పోలీసులు భౌతికదాడులకు దిగడంపై మండిపడ్డారు. ఆడబిడ్డలపై చేయి వేసిన పోలీసు అధికారులను డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితారెడ్డి, మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.