calender_icon.png 3 November, 2024 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సలాం.. తెలుగు సినిమా

03-11-2024 12:00:00 AM

ఒకప్పుడు కోటి రూపాయలతో సినిమా తీశారంటే గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులతో పాటు మనిషి ఆలోచనా విధానం కూడా మారింది. ప్రేక్షకుడిని థియేటర్‌కి రప్పించాలంటే బడ్జెట్ భారీగా పెట్టక తప్పదు. ఊహాలోకంలో మూడు గంటల పాటు ప్రేక్షకుడిని నిలపాలంటే గ్రాఫిక్స్.. ఇప్పుడు దానిని కూడా దాటి ఏఐ సాయం తీసుకోవాల్సిందే.

మరి ఇదేమైనా ఆషామాషి వ్యవహారమా? పైగా ఇప్పుడు స్టార్ హీరోలు, దర్శకులంతా పాన్ ఇండియాపై ఫోకస్ పెట్టారు. తెలుగు ప్రేక్షకులను మెప్పించడమే ఒకింత కష్టమైతే యావత్ దేశాన్ని.. ఆ మాటకొస్తే ఎల్లలు దాటి ప్రపంచాన్ని మెప్పించాలంటే మాటలు కాదు..

డబ్బు కట్టలు కుమ్మరించాల్సిందే. ఈ క్రమంలోనే తెలుగు సినిమా బడ్జెట్ పెరిగిపోతోంది. తెలుగు సినిమానా? అని నిట్టూర్పు విడిచే స్థాయి నుంచి సలాం అనిపించుకునే స్థాయికి తెలుగు సినిమా ఎదిగింది.  

‘బాహుబలి’ చిత్రం పాన్ ఇండియాకు బా టలు వేసింది. అక్కడి నుంచి మొదలు స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్‌లోనే తీస్తున్నారు. బడ్జెట్ లెక్కే లేదు. కోటి ఎప్పుడో పోయింది.. వందల కోట్ల బడ్జెట్ కూడా క్రమక్రమంగా పోతోంది. రాజమౌళి కాంబో సినిమా బడ్జెట్ రూ.1000 కోట్లంటూ టాక్ వినిపిస్తోంది.

ఇదంతా నిర్మాతలకు కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. సక్సెస్ అయ్యిందో లాభాల పంటే. అటు ఇటు అయితే మొత్తం ఖల్లాస్. రాజమౌళి సినిమా అంటే ఏ నిర్మాత అయినా ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఇప్పటి వరకూ హిట్ తప్ప ఫట్ లేదు.  అందుకే ఆయన చిత్రాలకు ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే దాదాపు నిర్మాతలు చాలా వరకూ ఒడ్డున పడతారు. ఇప్పటి వరకైతే రాజమౌళి సినిమాతో నిర్మాతలు కాసులు పండించుకున్నారే తప్ప నష్ట పోయింది లేదు. 

బాలీవుడ్ వారికి దక్షిణాది వారంటే కొంత చిన్నచూపు ఉండేది. ఇప్పుడు వారు కూడా ఆసక్తిగా మనవైపు చూడటమే కాదు.. తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తిని సైతం కనబరుస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ టాప్ 5 బడ్జెట్ ఇండియన్ సినిమాలేంటంటే.. కల్కి 2898 ఏడీ (600 కోట్లు), రోబో 2.0 (570 కోట్లు), ఆర్‌ఆర్‌ఆర్ (550 కోట్లు), ఆదిపురుష్ (500 కోట్లు), పెన్నియన్ సెల్వన్ (500 కోట్లు).

ఇక ఇప్పుడు రాజమౌళి రూ.1000 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీయనున్నారని టాక్. అంటే క్రమక్రమంగా ఇండియన్ సినిమా.. ప్రత్యేకించి తెలుగు సినిమా రేంజ్ హాలీవుడ్ స్థాయికి ఎదుగుతోంది. మరి తక్కువ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాలు సక్సెస్ కాలేదా? అంటే ఎందుకు కావు. కానీ అవి కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే మెప్పించగలుగుతాయి.

దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పిం చాలంటే వందల కోట్లు కుమ్మరించక తప్పనిసరి పరిస్థితి. దర్శకులు, హీరోలు సైతం పాన్ ఇండియా రేంజ్‌లో తమ సత్తా చాటాలని యత్నిస్తున్నారు. ఇక రాజమౌళి అయితే ఏకంగా హాలీవుడ్ రేంజ్ మూవీనే రూపొందించడానికి లోకేషన్స్ వేట మొదలు పెట్టేశారు. 

ఇంత భారీ బడ్జెట్ మూవీస్ రూపొందించడానికి ఓటీటీ కూడా ఒక కారణమనే చెప్పాలి. కథను నమ్ముకుని సాదాసీదాగా సినిమాను రూపొందిస్తే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. మహా అయితే మూడు వారాలు లేదంటే నెలలో ఓటీటీకి వచ్చేస్తుంది కదా.. అప్పుడు చూడొ చ్చులే అన్న ధీమా.

పైగా ఇప్పుడు అన్నీ మల్టీప్లెక్సులు అయిపోయాయి. కుటుంబం మొత్తం సినిమా చూడాలంటే వేలల్లో ఖర్చవుతుంది. కానీ భారీ బడ్జెట్ మూవీస్ విషయానికి వస్తే ప్రేక్షకుడి ఆలోచనా విధానం మారిపోతుంది. ఎప్పుడో ఒకసారి కదా.. డబ్బు పెడితే తప్పేముంది? ఇలాంటి సినిమాలు థియేటర్‌లోనే చూడాలన్న ఆలోచనకు వచ్చేస్తాడు.

సాధారణ సినిమాల విషయంలో చేసిన ఆలోచన భారీ బడ్జెట్ చిత్రాలకు వచ్చేసరికి మారిపోతుంది. కాబట్టి ప్రేక్షకుడిని థియేటర్ వరకూ రప్పించాలంటే వారినొక మాయాలోకంలోకి తీసుకెళ్లగలగాలి. దాదాపు 3 గంటల పాటు ఒక అద్భుతమైన ఫీల్‌ని ఇవ్వగలగాలి. దాని కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయక తప్పడం లేదు. మొత్తానికి తెలుగు సినిమా హాలీవుడ్‌ను అందుకుంటోంది. ఇదీ తెలుగోడి రేంజ్ అంటే.. 

 ప్రజావాణి చీదిరాల