calender_icon.png 20 January, 2025 | 10:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సలాం మనూ

29-07-2024 12:11:45 AM

  1. 10మీ ఎయిర్ పిస్టల్‌లో బాకర్‌కు కాంస్యం 
  2. పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్ 
  3. ఒలింపిక్స్‌లో పతకాల ఖాతా తెరిచిన భారత్

పారిస్ ఒలింపిక్స్ : 2024

1 షూటింగ్‌లో తొలి ఒలింపిక్ పతకం గెలిచిన భారత మహిళ..

1 ఈ ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ఇదే తొలి పతకం

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనేది పెద్దల మాట. ఆ మాటను నిజం చేసి చూపించింది భారత షూటర్ మనూ బాకర్. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే వెనుదిరిగిన మనూ రిక్త హస్తాలతో స్వదేశానికి చేరుకుంది. ఈ ఓటమితో అధైర్యపడని మనూ బాకర్ సరిగ్గా మూడేళ్ల తర్వాత అదే విశ్వవేదికపై పతకం గెలిచి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. వచ్చింది కాంస్యమే కావొచ్చు.. కానీ మనకు పసిడితో సమానం.

మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగం పతకం గెలిచి తొలి మహిళా షూటర్‌గా మనూ బాకర్ చరిత్ర సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్ అనంతరం షూటింగ్‌లో మనకు పతకం రాలేదు. 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పతకంతో మెరిసిన మనూ అందరి చేత సలామ్ కొట్టించుకుంది. మొత్తంగా ఒలింపిక్స్ ప్రారంభమైన మూడో రోజే భారత్ పతకంతో ఖాతా తెరిచింది. మనూ ఇచ్చిన స్పూర్తిని ఇలాగే కొనసాగిస్తూ మన అథ్లెట్లు మరిన్ని పతకాలు గెలవాలని ఆశిద్దాం.. 

మనూకు కాంస్యం

భారత్  బోణీ

  • తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు
  • 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో పతకం

పారిస్ విశ్వక్రీడల్లో కాంస్యం గెలిచిన భారత షూటర్ మనూ బాకర్ అంతర్జాతీయ వేదికపై జాతీయ జెండాను రెపరెపలాడించింది. ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్‌గా చరిత్రకెక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన మనూ బాకర్ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న చందంగా మూడేళ్లు తిరిగేసరికి అదే విశ్వవేదికపై పతకంతో సత్తా చాటింది.

ఒలింపిక్స్ మొదలైన మూడో రోజే భారత్ పతకాల ఖాతాను తెరిచింది. ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్ పోరులో మనూ బాకర్ ఆది నుంచి సత్తా చాటింది. తొలి రౌండ్ నుంచే ఆధిక్యంలో దూసుకెళ్లిన మనూ బాకర్ తృటిలో రజతం మిస్ అయినా 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం ఒడిసి పట్టింది. దక్షిణకొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు), కిమ్ యేజే (241.3 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు.

శుభాకాంక్షల వెల్లువ

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన మనూభాకర్‌కు రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

పారిస్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్ క్రీడల్లో భారత్ ఒడిలో పతకం వచ్చి చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ మనూ బాకర్ కాంస్యంతో మెరిసింది. తద్వారా ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో తొలి పతకం సాధించిన మహిళా షూటర్‌గా మనూ బాకర్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో మనూ బాకర్ 22 రౌండ్లు ముగిసేసరికి 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.

దక్షిణకొరియా షూటర్లు ఓహ్ యే జిన్ (243.2 పాయింట్లు), కిమ్ యేజే (241.3 పాయింట్లు) వరుసగా స్వర్ణ, రజతాలు గెలిచారు. 21 రౌండ్లు ముగిసేసరికి మనూ బాకర్ రెండో స్థానంలో నిలిచింది. అయితే 22వ రౌండ్‌లో మనూ 9 పాయింట్లు స్కోరు చేయగా.. కొరియాకు చెందిన కిమ్ యేజే 10 పాయింట్లు సాధించింది. దీంతో ఒక్క పాయింట్ తేడాతో మనూ తృటిలో రజతం చేజార్చుకుంది. ఈ ఒలింపిక్స్‌లో మనూ బాకర్ మరో రెండు విభాగాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌తో పాటు 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనూ మనూ బరిలోకి దిగనుంది.

ఎవరీ మనూ బాకర్ 

పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలవడంతో మనూ బాకర్ పేరు దేశం మొత్తం మార్మోగిపోతుంది. విశ్వక్రీడలు ప్రారంభమైన మూడో రోజునే మనూ కాంస్యంతో భారత్ పతకాల ఖాతా తెరవడం యావత్ దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. 22 ఏళ్ల మనూ బాకర్ స్వస్థలం హర్యానాలోని జజ్జర్ జిల్లా గోరియా గ్రామం. మనూ బాకర్ తన కెరీర్‌ను షూటింగ్ వైపు ఏంచుకోవడంలో తండ్రి రామ్ కిషన్ పాత్ర మరువలేనిది. 

14 ఏళ్లకే షూటర్‌గా..

మనూకు 14 సంవత్సరాల వయసు వచ్చే సరికి హుయెన్ లాంగ్లాన్, మణిపురి మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్, టెన్నిస్, స్కేటింగ్ వంటి ఇతర ఆటల్లో కూడా చురుగ్గా పాల్గొని పతకాలు సాధించింది. రామ్ కిషన్ బాకర్ ఇలా కాదని రూ. 1,50,000 పెట్టుబడి పెట్టి మనూకు షూటింగ్‌లో శిక్షణ ఇప్పించాడు. 2017లో జరిగిన ఆసియా జూనియర్ చాం పియన్‌షిప్‌లో మనూ వెండి పతకం సాధించింది. కేరళలో జరిగిన జాతీయ క్రీడల్లో మనూ తొలిసారి తొమ్మిది బంగారు పతకాలను కైవసం చేసుకుంది.

ఆ తర్వాత 2018 గోల్డ్‌కోస్ట్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో మెరిసిన మనూ 2021 ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లోనూ స్వర్ణంతో సత్తా చాటింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో ఆమెపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే మనూ ఇంటిబాట పట్టింది. ఈ ఓటమి నుంచి కోలుకోవడానికి చాలా సమయం తీసుకున్నప్పటికీ 2022 హాంగ్జౌ ఆసియా గేమ్స్‌లో స్వర్ణంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఆపై 2023 వరల్డ్ చాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణం గెలిచిన మనూ పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం తీసుకొస్తుందన్న నమ్మకం ఏర్పరిచింది. ఈరోజుతో అది నిజమయ్యింది. సలామ్ మనూ బాకర్.--

* టోక్యోలో నా ప్రదర్శనపై చాలా బాధపడ్డా. దాని నుంచి బయటకి రావడానికి చాలా సమయమే పట్టింది. ఈరోజు ప్రదర్శనపై ఏం మాట్లాడలేకపోతున్నా. రజతం మిస్ అయినా కాంస్యం రావడం సంతోషం కలిగించింది. మరో రెండు ఈవెంట్లు ఉన్నాయి. వాటిలోనూ పతకాలు గెలవాలని కోరుకుంటున్నా.. స్వయానా ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించడం సంతోషం కలిగించింది. 

 మనూ బాకర్, భారత షూటర్

ఎంతో మందికి స్ఫూర్తి

ఎంతో మంది యువ క్రీడాకారులకు ఈ పతకం స్ఫూర్తినిస్తుంది. భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మొదటి మహిళ షూటర్‌కు శుభాకాంక్షలు. 

 ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి

ఇది చారిత్రాత్మక విజయం

పారిస్ ఒలంపిక్స్‌లో భారత్ తరఫున మొదటి మెడల్ సాధించిన షూటర్ మనూ బాకర్‌కు శుభాకాంక్షలు.. ఈ విజయం ఎంతో ప్రత్యేకం

 మోదీ, ప్రధాని

కంగ్రాట్స్ మనూ

పారిస్ ఒలింపిక్స్‌లో ఇండి యా తరఫున మొదటి పత కం గెలిచినందుకు శుభాకాంక్షలు.. నీవు అందర్ని తలెత్తుకునేలా చేశావ్..

 గౌతమ్ గంభీర్, 

టీమిండియా హెడ్ కోచ్

దేశానికే గర్వకారణం

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పతకం మన దేశానికే గర్వ కారణం. మనూ ఘతన ఎన్నేళ్లయినా గుర్తుంటుంది. మిగతా క్రీడా కారులు మనూను స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని పతకాలు సాధించాలి. 

 కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్

కఠోర శ్రమకు సెల్యూట్

 గేమ్ మీద నీకున్న ఫ్యాషన్, కఠోర శ్రమకు తగిన గుర్తింపు లభించింది. హృదయపూర్వక శుభా కాంక్షలు.

అభినవ్ బింద్రా

దేశానికి గర్వకారణం

టోక్యో ఒలింపిక్స్‌లో దురదృష్టం వెంటాడినా నువ్వు చూపిన తెగువ అమోఘం. పతకంతో దేశాన్ని తలెత్తుకునేలా చేశావు. 

                  సచిన్

పతకాల పట్టిక

స్థానం దేశం స్వ కా మొత్తం

1 ఆస్ట్రేలియా 2 0

కొరియా 2 1

చైనా 3 1

జపాన్ 5

4 ఫ్రాన్స్ 2 2 1 5

౨౨ భారత్ 0 0 1 1

నోట్: స్వా ర కా

 విజయక్రాంతి, ఖేల్ విభాగం