రాజేంద్రనగర్, జూలై 05: ప్రపంచ చాంపియన్‌గా నిలవడం ఆనందంగా ఉందని హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ పేర్కొన్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి రెండోసారి వరల్డ్‌కప్ దక్కించుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉండటం గర్వంగా ఉందని సిరాజ్ అన్నాడు. కరీబియన్ దీవుల నుంచి తిరిగి వచ్చిన టీమిండియాకు ఢిల్లీ, ముంబైలో ఘనస్వాగతం లభించగా.. ముంబైలో విజయోత్సవ ర్యాలీ అనంతరం సిరాజ్ హైదరాబాద్ చేరుకున్నాడు.
శుక్రవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన సిరాజ్‌కు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ సందర్భంగా సిరాజ్ మాట్లాడుతూ.. ‘పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు 17 ఏళ్ల తర్వాత రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. వరల్డ్‌కప్ చాంపియన్ జట్టులో భాగమైనందుకు ఆనందంగా ఉంది. హైదరాబాదీగా ఎంతో సంతోష పడుతున్నా. మున్ముందు కూడా ఇదే జోరు కొనసాగిస్తూ.. మరిన్ని విజయాలు సాధిస్తాం’ అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అనంతరం ఇంటికి బయలుదేరిన సిరాజ్‌కు దారి పొడువునా.. అభిమానులు ఘన స్వాగతం పలికారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా.. మెహిదీపట్నం సరోజిని ఆస్పత్రి వద్ద అభిమానులు ‘సలామ్ సిరాజ్’ అంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.