25-02-2025 06:58:35 PM
కాటారం (విజయక్రాంతి): మతిస్థిమితం కోల్పోయి, బట్టలు లేకుండా రోడ్లపై తిరుగుతున్న మహిళని ఆమె తల్లిదండ్రులకు "సఖి" కేంద్రం నిర్వాహకులు అప్పగించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొండంపేట పరిసరాలలో మతిస్థిమితం లేకుండా, ఒక యుక్త వయసు మహిళ బట్టల్లేకుండా తిరుగుతుందని మహిళా హెల్ప్ లైన్ 181 కి ఫోన్ ద్వారా రాజబాబు అనే రిపోర్టర్ సమాచారం అందించారని భూపాలపల్లి సఖి కేంద్రం అడ్మినిస్ట్రేటర్ గాయత్రి తెలిపారు. మహాదేవపూర్ ప్రాజెక్ట్ సిడిపిఓ రాధిక, అంగన్ వాడి సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి, టీచర్ కళ్యాణి సహకారంతో రెస్క్యూ నిర్వహించారు.
సఖి కేంద్రానికి తీసుకువచ్చి కొత్త బట్టలు వేయించి కౌన్సిలింగ్ నిర్వహించారు. సదరు మహిళ కాటారం మండలం అంగడి బజార్ కు చెందిన పులి సంధ్యారాణి (36) గా గుర్తించారు. దాంతో కాటారం ఎస్సై అభినవ్ సహకారంతో బాధిత మహిళ పూర్తి వివరాలు సేకరించి, ఆమె తండ్రి పులి అంకూస్, అక్క బావలు స్వరూపరాణి పోశంలకు అప్పగించారు. సంధ్యారాణి వైద్యం కోసం సఖి సెంటర్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సఖి సెంటర్ కేసు వర్కర్ సరిత, మల్టీపర్పస్ స్టాప్ సుమలత పాల్గొన్నారు.