గన్నమరాజు గిరిజా మనోహర బాబు
“సకల నయశాస్త్ర మతములు సంగ్రహించి
గ్రంథ మొనరింతు లోకోపకారమగును..”
అంటూ ఒక స్థిర నిర్ణయంతో, చిత్తశుద్ధితో లోకోపకార దృక్పథంతో తెలుగులో తొట్ట తొలి సంకలన గ్రంథమైన ‘సకలనీతి సమ్మతము’ను రచించిన గొప్పనీతి మహాకవి మడికి సింగన. ‘సాహిత్యం ప్రయోజనమే లోకోపకారం, ఇదే ముఖ్యం కూడా’ అన్నది అన్ని శాస్త్రాలు అంగీకరించిన విషయమే. ఈ లక్ష్యంతోనే మడికి సింగన తన గ్రంథరాజం ‘సకలనీతి సమ్మతము’ను సిద్ధం చేశాడు. ప్రాకృతంలో హాలుని ‘గాథా సప్తశతి’ సంకలనం వంటిదే సింగన ఈ రచన కూడా. అయితే, రెండూ కరీంనగర్ ప్రాంతం నుండే వెలువడడం ఒక విశేషం. కరీంనగర్ ప్రాంతంలోని రామగిరి ఈ కావ్యానికి జన్మ స్థలం.
తొయ్యేటి అనపోతన నాయకుడు కాలధర్మం చెందిన తరువాత మడికి సింగన పూర్వీకులు రాజమండ్రి నుండి కరీంనగర్ జిల్లాలోని రామగిరి దుర్గానికి చేరుకొని ఇక్కడి పాలకుల ప్రాపకం సంపాదించారు. అప్పుడు ఈ దుర్గాన్ని ముప్ప భూపతి పాలిస్తున్న విషయాన్ని అభ్యుదయ రచయత ఆరుద్ర పలు ఆధారాలతో వివరించారు. ఈ ప్రాంతపు వాడైన వాణస కందనామాత్యుడు సింగనకు మిక్కిలి ఆప్తుడై ఆదరించి, ఆశ్రయమిచ్చినట్టు ఆయన రాశారు. ఈ మడికి సింగనామాత్యుని కారణంగానే కందనామాత్యునికి మంచిపేరు వచ్చింది.
దీనికి సింగన రచించిన ‘పద్మ పురాణం’లోని
“నీ సహవాస సౌఖ్యములు నెమ్మిజరించుట చేసి దిక్కులన్
వాసికి నెక్కి శిష్టజన వర్గముచే బొగడొంది కావ్య వి
ద్యా సుఖికేళి చేర్చి కడు ధన్యతతో బహుదాన లక్షులన్
భాసుర కీర్తియై నెగడి ప్రస్తుతి కెక్కితి మర్త్యకోటిలోన్”
అన్న పద్యమే ప్రమాణమై నిలుస్తుంది.
నాలుగు మహాగ్రంథాలు
‘సకలనీతి సమ్మతము’ (సంకలన గ్రంథం), ‘పద్మ పురాణోత్తర ఖండము’, ‘భాగవత దశమ స్కంధము’, ‘జ్ఞాన వాసిష్ఠ రామాయణము’ అనే నాలుగు గ్రంథాలు మడికి సింగన రచనలుగా తెలుస్తున్నది. ‘క్రీ.శ.1420 1440 మధ్య కాలంలో ఆయన వీటిని రచించి ఉంటారని’ ఆచార్య ఎస్.వి. రామారావు అభిప్రాయపడ్డారు. మడికి సింగన కాల నిర్ణయాన్ని గురించి చాగంటి శేషయ్య (ఆంధ్ర కవి తరంగిణి), మల్లంపల్లి సోమశేఖరశర్మ, వేదం వేంకట రాయశాస్త్రి, ఆరుద్ర, ఆచార్య ఎస్.వి.రామారావు వంటి పెద్దలు విస్తృతంగా చర్చించారు.
‘సకలనీతి సమ్మతము’ ఒక ప్రత్యేకత కలిగిన విశేష గ్రంథం. సింగన స్వయంగా చెప్పుకున్నట్లు ఇదొక గొప్ప లోకోపకార రచన. ఇందులోని వివరాలనుబట్టి 25 తెలుగు రచనలు పరిచయమైనా యి. వాటితోపాటు నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, నన్నెచోడుడు, మంచన, మారన వంటి ప్రసిద్ధుల రచనల్లోని పద్యాలతోపాటు కందనామాత్యుడు, ఆంధ్రభోజుడు, రుద్రదేవుడు, బద్దెన, శివ దేవయ్య, శ్రీగిరి వంటి కవుల రచనల్లోని పద్యాలు కూడా తెలుగువారికి ఈ గ్రంథం ద్వారా వెలుగులోకి రావడం గమనార్హం. ఇవన్నీ గొప్పగా ఆలోచింపజేసేవే.
సకల నీతి పద్యాల సారం
వివిధ కవుల రచనల్లోని నైతిక విలువలు బోధించే పద్యాలను ఏర్చి కూర్చడం ‘సకలనీతి సమ్మతము’ గ్రంథం ప్రత్యేకతగా చెప్పాలి. పలువురు మహాకవులు, రచయితల రచనలతో విశిష్ఠ ప్రయోజనాన్ని ఆశించి వెలువడ్డ తొలి సంకలన గ్రంథంగానూ దీనిని అభివర్ణించాలి. పూర్వకవుల రచనల్లోని పద్య రత్నాలను తవ్వి తీసి ఒకచోట విషయపరంగా గుదిగుచ్చి ఎంతో ప్రణాళికా బద్ధంగా సింగన ఈ కృతిని తీర్చిదిద్దాడు. దీని కారణంగా ప్రసిద్ధులైన మహాకవులు మాత్రమేగాక మరెందరో కవులు సాహితీ ప్రపంచంలో గొప్పగా నిలిచిపోయారు. కాకతీయ యుగంలోని ఎందరో అజ్ఞాత కవులు కూడా ‘సకలనీతి సమ్మతము’ వల్లనే వెలుగుచూశారు.
‘సకలనీతి సమ్మతము’లో మనకు లభ్యమవుతున్న మూడు ఆశ్వాసాల్లో వివిధ గ్రంథాల నుండి సేకరించిన పద్యాలు 800 దాటాయి. వాటిలో సింగన తాను రచించిన పద్యాలను కూడా చేర్చాడు. ‘మదీయము’ అని పేర్కొన్న తన పద్యాలు కేవలం 39 మాత్రమే. మిగిలినవన్నీ పలువురు కవుల పద్యాలే. మరికొన్ని నీతిశాస్త్రాల్లోని పద్యాలు సుమారు 200 వరకు సేకరించి ఇందులో చేర్చాడు. ఈ దృష్ట్యానే, దీనికి ‘సకలనీతి సమ్మతము’ అన్న పేరు సార్థకమైంది.
అంతా ప్రజోపయోగ సాహిత్యమే
వివిధ కవుల కావ్యాల్లోని పద్యాల్లో కొన్ని ‘యుద్ధదాన ప్రకారాని’కి సంబంధించినవి, ఇంకొన్నే మో ‘రాజులకు పనికిరాని గుణాలను’ గురించి, మరికొన్ని ‘కూట యుద్ధానికి సంబంధించినవి’, ఇంకాకొన్ని ‘సేవకు అనర్హులైన రాజులకు సంబంధిం చినవి’ వున్నాయి. ఈ విధంగా సుమారు 48 అంశాలకు సంబంధించిన పద్యాలు పలువురు కవుల రచనల నుండి సమకూర్చబడటం విశేషం. దీనినిబట్టి మడికి సింగన ప్రజావసరమైన అంశాలను తన సంకలనంలో చేర్చడం గురించి ఎంతగా ఆలోచించాడో అర్థమవుతున్నది. ఇందులోని పద్యాల (39)తోపాటు ఆయన రచించిన ఇతర కృతులూ సింగనను ప్రతిభావంతుడైన మహాకవిగా చరిత్రలో స్థానం సముపార్జించుకోవడానికి దోహదపడ్డాయి.
పోతన భాగవతానికి ముందే..
మడికి సింగన మరో రచన ‘భాగవత దశమ స్కంధం’. ‘మహాభాగవతం’లోని దశమ స్కంధమంతా శ్రీకృష్ణుని చరిత్ర. సాధారణంగా కృష్ణుని చరిత్ర కవులను ఆకర్షించే ఘట్టం. ఆయన బాల్యచేష్టలు, రాసక్రీడలు వంటివి ఏ కవికైనా గొప్పగా ప్రభావితం అవుతుంటాయి. ‘పోతన భాగవతం’ కన్నా ముందే వెలువడ్డ ఈ రచన ఒక విధంగా పోతనకు మార్గం సుగమం చేసిందేమో. అయితే, ఈ కావ్యం ద్విపదల్లో విరచితమైంది. ప్రత్యేకంగా కాండ విభాగం ఇందులో కనిపిస్తుంది.
మధురకాండ, కల్యాణకాండ, జగదభి రక్షకాండ మొదలైన విభా గాలుగా ఉంది. ‘అక్రూర స్తుతి’ మొదలు ‘శిశుపాల వధ’ వరకు వున్న అన్ని ఘట్టాల్లో చేసిన గొప్పగొప్ప వర్ణనలు భావి కవుల కు మార్గదర్శకాలైనాయి. క్రీ.శ.1425 ప్రాంతంలో విరచితమైన ఈ రచన పూర్తిగా లభించక పోవడం తెలుగువారి దురదృష్టమనే చెప్పాలి. శ్రీకృష్ణుని వృత్తాంతంలో అతిముఖ్య ఘట్టాలైన ‘రుక్మిణీ కల్యాణం’, ‘నరకాసుర వధ’ పద్మపురాణంతోసహా ఈ ద్విపద భాగవతంలోను చోటుచేసుకున్నాయి. రెండింటిలోనూ సత్యభామ యుద్ధం, ఊర్వశీ నరకాసురుల సంవాదం మాత్రం లేవు. ‘ద్విపద భాగవతము’గా పేరొందిన ఈ రచన సింగన కవిత్వ పటిమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
అహోబిల స్వామికే అంకితం
మడికి సింగన తన రచనల్లో చివరిదైన ‘జ్ఞాన వాసిష్ఠ రామాయణము’ను అహోబిల నరసింహస్వామికి అంకితమిచ్చి, మహాభక్తుడుగా నిలిచి పోయాడు. దీనికి పూర్వం రచించిన ‘సకలనీతి సమ్మతము’ కాని, ‘పద్మ పురాణోత్తర ఖండము’ కాని, ‘భాగవత దశమ స్కంధము’ కాని.. ఏ రచననూ ఆయన మానవాంకితం చేయలేదు. తన రచనలన్నీ దైవాంకితాలే. ముప్ప భూపాలుడు మడికి సింగనకు ఎన్నో గ్రామాలు ఇచ్చినా తాను మాత్రం తన కృతులు ఆయనకు (నరాంకితం) చేయలేదు. ఇది మడికి సింగన వ్యక్తిత్వానికి దర్ప ణం పట్టే అంశం.
మెరమెచ్చులకో, ప్రలోభాలకో, అధికారానికో ఏ మాత్రం లొంగని స్థిరచిత్తుడుగా సింగనను అర్థం చేసుకోవాలి. సంస్కృత ‘యోగ వాసిష్ఠం’లోని అంశాలే ఈ ‘జ్ఞాన వాసిష్ఠం’లోనూ పొందుపరిచి వున్నాయి. ‘గురుకులం నుండి వచ్చిన శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుని ఆదేశంతో వసిష్ఠుని వద్దకు వెళ్లి జ్ఞానం సంపాదించడమే’ ఈ రచనా వస్తువు. వేదాంతమే ఇందలి విషయం. ఇతర రచనల వలె ఇదికూడా సరళ శైలిలోనే సాగింది. ఈ రచనద్వా రా మడికి సింగన తన ఛందో ప్రతిభనూ ప్రదర్శించాడు. ప్రసిద్ధ ఛందో విశేషాలుసహా ‘అల్పాక్కర’ వంటి ‘అక్కర’లలో భేదాన్ని కూడా ప్రయోగించి పద్యాలు రచించాడు. ఇది ఛందస్సుపై సింగన గొప్ప సాధికారతను తెలియచేస్తుంది.
‘జ్ఞాన వాసిష్ఠం’లో దుష్కవులను గురించి చెబుతూ
“కదిసిన నోరవోయి యొరుకబ్బెము దొంతుల సత్పదార్థముల్
గదుకుచు నెట్టివారి బొడగన్నను, గుర్రని స్నేహసౌఖ్యముల్
మదికి నసహ్యమై శునక మార్గమునన్ చరియించుచున్న దు
ష్పద కవులెల్ల మత్కవిత దప్పులు పట్టక విండ్రుగావుతన్”
అన్నారు ఘాటుగా. తన కవిత్వం పట్ల తనకున్న ఆత్మవిశ్వాసం, అది అందరికీ ఆమోదయోగ్యమైన కవిత్వమేనన్న స్థిరమైన నమ్మకం ‘జ్ఞాన వాసిష్ఠం’లోని ఈ పద్యం వల్ల స్పష్టమవుతున్నది.
‘జ్ఞాన వాసిష్ఠం’లో జ్ఞానబోధ
తెలుగు సాహితీ ప్రపంచానికి విలువైన ఎన్నె న్నో విషయాలపై అవగాహన కలిగించే మహాకవుల కృతులలోని పద్యాలను ఏర్చికూర్చి ఘనమైన పద్య సంపదను అందించిన సింగన మానవులు ప్రదర్శించే అహంకారాన్ని గురించి తన ‘జ్ఞాన వాసిష్ఠం’లో ఒక అందమైన పద్యంలో చక్కగా చెప్పాడు.
“ఎరుక పడకున్న నహ మర్ధమెద్ధి యేని
మలిన రూపంబు దోచి దంభకము నొందు
నెరుక వడి యున్న నహ మర్థమెద్ది యేని
యదియె పరమాత్మ తానై వెలుంగు”
అంటూ చెప్పిన మాట పరమ, ప్రత్యక్ష సత్యం.
వ్యాసకర్త సెల్: 9949013448
అందమైన కవితా ధోరణి
మడికి సింగన రచించిన ‘పద్మ పురాణోత్తర ఖండం’లో ఆయన మూలాన్ని మాత్రం పక్కకు తప్పించలేదు. మూలానుసారంగానే అనువదించడం గమనార్హం. దీనిని ఆయన క్రీ.శ. 1421 ప్రాంతంలో రచించి ఉండవచ్చునని అర్థమవుతున్నది. ఇందులో అనేక వ్రతకథలు, దశావతార కథలు మొదలైనవేకాక ‘పురూరవ చరిత్ర’, ‘సుందోప సుందుల కథ’, ‘మాఘస్నాన మాహాత్మ్యము’ వంటివి ఉన్నాయి. దీనిలోని మూడవ ఆశ్వాసంలోని 67 పద్య గద్యాల్లో ‘అహల్యా సంక్రందన కథ’ కూడా విపులంగా వివరించి ఉంది. అందమైన కవితా ధోరణిని పుణికి పుచ్చుకున్న సింగన కవితలో అంత్యాన ప్రాసరీతులు అధికంగా కనిపిస్తాయి. తదనంతరం వారైన పోతనాది కవులకు ఈ రీతి మార్గదర్శనమైందని చారిత్రకారుల భావన.