- నాలుగున్నర ఎకరాల్లో రూ.95 కోట్లతో నిర్మాణం
- సాంస్కృతిక కార్యక్రమాల కోసం భారీ ఆడిటోరియం
- నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
జనగామ, నవంబర్ 18 (విజయక్రాంతి): కళలు, సాంస్కృతిక కార్యక్రమాల పుట్టినిళ్లున వరంగల్‌లో సకల హంగులతో కాళోజీ కళాక్షేత్రం ఏర్పాటైంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా భారీ కళాక్షేత్రంగా ఇది విలసిల్లబోతోంది. 4.24 ఎకరాల స్థలంలో తెలంగాణ ప్రభుత్వం రూ.95 కోట్లు వెచ్చించి ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకార్థం ఆయన పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించింది.
పదేళ్ల క్రితం చేపట్టిన నిర్మాణ పనులు ఇటీవలే పూర్తి కావడంతో నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 2014లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవచారి మైదానంలో కాళోజీ పేరుతో భారీ కళాక్షేత్రం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
పదేళ్లుగా పనులు కొనసాగగా ఇటీవలే పూర్తయ్యాయి. ఇదే నెల 9న కాళోజీ జయంతి సందర్భంగా కళాక్షేత్రాన్ని ప్రారంభించాలనుకున్నారు. అనివార్య కారణాల వల్ల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారు.
రవీంద్రభారతికి దీటుగా
కాళోజీ కళాక్షేత్రాన్ని అత్యాధునిక సౌకర్యాలతో ఆకట్టుకునేలా నిర్మించారు. హైదరాబా ద్‌లోని రవీంద్రభారతికి దీటుగా కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు. ఈ క్షేత్రంలో అధునాతన లైటింగ్, సౌండింగ్ సిస్టం ఏర్పాటు చేసి నాలుగు అంతస్తుల్లో నిర్మాణం చేపట్టారు. 2,990 చదరపు మీటర్ల వైశాల్యంతో భారీ ఆడిటోరియం, 2400 అడుగుల స్థలంలో భారీ స్టేజీ ఏర్పాటు చేశారు.
కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమాలను వీక్షించేందుకు ఆడిటోరియంలో 1,150 మందికి సీటింగ్ సామర్థ్యం కల్పించారు. కళాక్షేత్రంలో కాళోజీ ఆర్ట్ గ్యాలరీ, గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఆడిటోరియం ఎదుట కాళోజీ కాంస్య విగ్రహం, వాటర్ ఫాంటెయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కాంతులీనుతున్న కళాక్షేత్రం
సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కాళోజీ కళాక్షేత్రాన్ని అధికారులు అందంగా ముస్తాబు చేశారు. రెండు రోజులుగా విద్యుత్ దీపాల వెలుతురులో కళాక్షేత్రం కాంతులీనుతోంది. ఆడిటోరియం ముందు ప్రాంతంలో ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహం, తామర పూల ఫౌంటెయిన్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి.
కాళోజీ విగ్రహ రూపశిల్పి వడియార్
హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): ప్రజాకవి కాళోజీ నారాయణరావు 110వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. కాంగ్రెస్ విజయోత్సవ సభలో పాల్గొనేందుకు వరంగల్ వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
కాళోజీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తాన శిల్పి డీ విజయ్‌కుమార్ వడియార్ తయారు చేశారు. దాదాపు 600 కిలోల కంచు లోహంతో రూపొందించారు. రూ.8లక్షల వరకు ఖర్చు అయ్యింది. ఏపీలోని తూర్పుగోదవారి జిల్లా కొత్తపేటకు చెందిన విజయ్‌కుమార్ కుటుంబం మూడు తరాలుగా విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందింది.
దాదాపు 109 ఏళ్లుగా వీరి కుటుంబం ఈ వృత్తిలో ఉన్నది. ప్రస్తుతం ఆయన ఏపీ ప్రభుత్వ ఆస్తాన శిల్పిగా ఉన్నారు. ఏపీ సర్కారు కళారత్నతో సత్కరించింది. కాకాతీయ యూనివర్సిటీ ఆచార్య గౌరవ పురస్కారంతో గౌవరించింది. విజయ్‌కుమార్ ఇప్పటి వరకు ఆయన 500పైగా కాంస్య విగ్రహాలను తయారు చేశారు.
అందులో కాళోజీ విగ్రహాలు మూడు ఉన్నాయి. వరంగల్‌లోని నక్కల గుట్ట చౌరస్తాలో, కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఏర్పాటు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది మూడోది. ఈ మూడు విగ్రహాల రూపకల్పన బాధ్యత ప్రభుత్వాలే అప్పగించాయి.