గన్నమరాజు గిరిజా మనోహరబాబు :
‘కవిత్వ సుమహిత సుఖ పరాయణుడు’
“చెలగి ఋగ్వేద ప్రసిద్ధుడై జగతి
వెలయు హరిశ్చంద్ర విభు పుణ్యచరిత
కవితా చమత్కృతి గాంచి హర్షించి
కవులందరు శిరః కంపంబుజేయ
బచరించి వీనుల పండువుగా రచియింతు...”
అంటూ గొప్ప నాటకీయత కలిగిన ద్విపద మహాకావ్యం ‘హరిశ్చంద్రోపాఖ్యానము’ రచించిన గౌరన మహాకవి ‘సరస సాహిత్య లక్షణ విచక్షణుడు’, ‘ప్రతివాద మదగజ పం చాననుడు’ అనే బిరుదులున్న కవీశ్వరుడు. ఇంతకు పూర్వం ఋగ్వేదం, స్కాంద పురా ణం, మార్కండేయ పురాణాల్లో చోటు చేసుకున్న హరిశ్చంద్రుని కథను మొదటిసారి ఒక ప్రత్యేక కావ్యంగా రూపొందించాడు. తిక్కన వంటి నాటకీయ ఫక్కీలో, పాల్కురికి సోమన ప్రారంభించిన ‘ద్విపద’ ఛందస్సులో గౌరన ఈ కావ్యాన్ని రచించడం విశేషం.
మూడు గొప్ప రచనలు
విలక్షణ శైవ మహాకవి గౌరన రచనలు మూడు. వాటిలో మొదటిది ‘నవనాథ చరి త్ర’ ద్విపద కావ్యం. రెండోది ‘హరిశ్చంద్రోపాఖ్యానము’ మరో ద్విపద కావ్యం. ఈ రెండూ ద్విపద కావ్యాలే అయినా, మూడోది మాత్రం ‘లక్షణ దీపిక’ అనే గొప్ప లక్షణశాస్త్రం. దీన్ని గౌరన సంస్కృత భాషలో రాయడం మరో విశేషం. ఈ మూడు రచనలూ మూడు మా ర్గాలకు చెందినవి. ద్విపద కావ్యాలు రెండు విభిన్న తత్తాల్ని తెలిపేవి అయితే, మూడవది పూర్తిగా శాస్త్ర రచన.
అఖండమైన కాకతీయ రాజుల పాలన ముగిసిన పిదప ఒకవైపు రెడ్డిరాజులు, మరోవైపు పద్మనాయక రాజులు, ఇంకోవైపు విజయనగర రాజులు తెలుగు నేలకు పాలకులై పరిపాలన సాగిస్తున్నారు. అప్పుడు రాచకొండ, దేవరకొండ రాజ్యాల్ని ఏలుతున్న కాలంలో దేవరకొండ పాలకుడైన మాదానాయుడన్న నామాంతరం గల మాధవ క్షితి పాలునిమంత్రి పోతరాజు తమ్ముడు అయ్యలుమంత్రి (ఎల్లమంత్రి) కుమారుడే గౌరన కవి. ఈ మాదానాయుడు క్రీ.శ. 1361 1384 కాలానికి చెందినవాడు. దీనినిబట్టి గౌరన స్థలకాలాలను గురించి పెద్ద వివాదాలేమీ లేవు. పద్మనాయక ప్రభువులెందరో సంస్కృతాంధ్ర కవి పండితులను పోషించా రు.
ఈ రాజులచేత ప్రత్యేక గౌరవాలు పొం దిన ఎందరో మహాకవులు తెలుగు సాహితీ ప్రపంచంలో దర్శనమిస్తారు. గౌరన కేవలం కవి మాత్రమే. వారి కుటుంబమంతా రాచకొండ రాజ్య రాజకీయాలతో సంబంధా లున్న వారేనని ఆచార్య ఎస్.వి.రామారావు, డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి వం టి పరిశోధకులు తేల్చారు. గౌరన తల్లిదండ్రు లు పోచాంబ, అయ్యలుమంత్రి సోదరుడు ధరణిమంత్రి వీరి పేర్లనుబట్టి వీరి పదవులు తెలుస్తున్నాయి. గౌరన మాత్రం పదవులవైపు దృష్టి సారింపక కేవలం కవిత్వం దిశగానే తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. పైగా తాను ‘కవిత్వ సుమహిత సుఖ పరాయణుడన’ని స్పష్టంగా చెప్పుకున్నాడు.
పాల్కురికి, సోమనల ప్రభావం
గౌరన కృతుల్లో పూర్వకవుల ప్రభావం గణనీయంగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ద్విపద కావ్య రచన ప్రారంభకుడైన పాల్కురికి సోమన ప్రభావం ఆయన రెండు ద్విపద కావ్యాల్లోనూ దర్శనమిస్తుంది. అంతేగాక, నవీన గుణన నాథుడుగా కీర్తిని పొందిన నాచన సోమన ప్రభావం కూడా గౌరనపై ఉన్నట్టు కనిపిస్తుంది. మహాకవి తిక్కన నాటకీయతను గౌరన తన రచనల్లో పూర్తిగా ప్రతిబింబింపచేశారు. ఇది ఆయనకు తిక్కనపై వున్న గౌరవానికి నిదర్శనం. గౌరన కవి ప్రతిభను ‘విద్యుత్‌పూర్ణ ప్రతిభ’గా గుర్తించాలి.
నేటికీ హరిశ్చంద్ర నాటక ప్రదర్శనల్లో కనిపించే ‘నక్షత్రకుడు’ గౌరన సృష్టించిన పాత్ర యే. గౌరన వేదాల్లోని హరిశ్చంద్రుని కథను అనుసరించి తన కావ్యాన్ని నిర్మించాడు. కాలకౌశికుడు, కలహకంఠి వంటి పాత్రలను సృష్టించి వారి సంభాషణల్లో హాస్యం పండించాడు. కథలోని వీరదాసు, వీరబాహులు కూ డా గౌరన సృష్టే. మూలంలోని శైబ్య గౌరన కావ్యంలో చంద్రమతి, మూలంలోని రోహితాస్యుడు గౌరన కావ్యంలో లోహితాస్యు డయ్యాడు. ఈనాటికీ ఈ పాత్రల పేర్లు స్థిరపడి, గౌరన కీర్తిని ఇనుమడింపజేస్తున్నాయి.
అద్భుత శబ్ద ప్రయోగాలు
హరిశ్చంధ్రునిపై విశ్వామిత్రుడు కోపగించిన సందర్భంలో..
“ముఱముఱ లేమని చేమల్ ముడిపాటు గదుర
జుఱజుఱ నిప్పులక్షుల నుప్పతిల్ల
పొటిపొటి చెమటచై చోడమ నాసికయు
యిటమట గటములు బారిబారిన దర
మోగమున జేవురు మురువు నటింప
భుగభుగ నిగుడు నూర్పుల పొగ లెగయ
గటకట బడి యౌడుగఱచి హుమ్మనుచు...”
అన్న పంక్తుల్లోని ‘ధ్వన్యనుకరణ’ శబ్ద ప్రయోగాలు గౌరనకు శబ్దాలపై వున్న అధికారానికి ఉదాహరణలుగా నిలుస్తాయి.
నక్షత్రకుని పాత్ర సృష్టికర్త
వెన్నెలకంటి చంద్రశేఖర కవి ద్విపదలోనే రచించిన ‘హరిశ్చంద్రోపాఖ్యానాని’కి గౌరన కావ్యానికి లభించినంత గౌరవం లభించలేదని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. ఎల్లకాలం గుర్తుండి పోయే నక్షత్రక పాత్ర కారణంగా పాఠకునికి కావ్య నాయకుడైన హరిశ్చంద్రునిపట్ల గొప్ప సానుభూతి కూడా కలుగుతుంది. సత్యసంధతకు ప్రతీక అయిన హరిశ్చంద్రుని పాత్రతోపాటు ఆ సత్యసంధతకు దోహదం చేసిన పాత్రగా చంద్రమతి పాత్రకూడా చిరస్థాయిగా పాఠకుల హృదయాలలో స్థిరపడిపోతుంది.
‘ద్విపద కావ్యం విసుగు పుట్టించు గుణ ము కలది’ అన్న పింగళి వారి అభిప్రాయాన్ని గౌరన కావ్యాలు మార్చివేస్తాయి. దానికి గౌర న ప్రతిభయే కారణం. ‘హరిశ్చంద్రోపాఖ్యా నం’ కంటే పూర్వం గౌరన రచించిన ‘నవనా థ చరిత్రము’ కూడా ఆయన విశేష ప్రతిభకు దర్పణమై నిలుస్తుంది. గౌరన మరో రచన ‘నవనాథ చరిత్రము’. ఇది కూడా ద్విపద కావ్య మే. అనేకమంది సాహిత్య చరిత్రకారులు ఈ రచన బహుశ ‘హరిశ్చంద్రోపాఖ్యానము’కంటే ముందు చేసిన రచనగానే భావించారు.
నాథ సంప్రదాయ కథాంశాలు
రచనా పరంగా ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ లో కవి పరిణతి కనిపిస్తుందన్నారు. ఈ కావ్యం గురించి కోరాడ రామకృష్ణయ్య, ఆరు ద్ర, ఎస్.వి.రామారావు, వేదం వెంకట రాయశాస్త్రి, గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి వంటివారు అనేక విశేషాంశాలు వ్యక్తీకరించారు. ఇది నాథ సంప్రదాయ సంబంధమైన కథాంశాలతో కూడిన కావ్యం. కనుక ఈ సంప్రదాయాన్ని గురించి, ఈ నవనాథులను గురించి, వారి ఆధ్యాత్మిక విశేషాలపైనా సం పూర్ణ అవగాహన కలిగిన కవిగా గౌరనను భావించవచ్చు. సత్యవీర ప్రబోధాన్ని బోధించిన ‘హరిశ్చంద్రోపాఖ్యాన’ ఇతివృత్తానికి, ‘నవనాథ చరిత్ర’ ఇతివృత్తానికి ఎంతో వ్యత్యా సం ఉంది.
ఇందులో అనేక సామాజిక విశేషాలను సందర్భోచితంగా జోడించి తన రచ నకొక ప్రయోజనాన్ని చేకూర్చాడు. ‘సాధారణంగా ఈ నవనాథుల చర్యలకు ప్రధాన రంగం మహారాష్ట్ర దేశభాగమని’ మద్రాసు విశ్వవిద్యాలయం వారు ముద్రించిన గౌరన ‘నవనాథ చరిత్ర’కు విపులమైన పీఠిక సంతరించి పెట్టిన శ్రీ కోరాడ రామకృష్ణయ్య అభి ప్రాయపడ్డారు. కవి తన కాలం నాటి సమాజాన్ని సాకల్యంగా పరిశీలించి మిక్కిలి చైత న్యంతో ఆయా విశేషాలకు స్థానం కల్పించా డు. వ్యక్తుల మనస్తత్వాలు, వర్గతత్తాలను అ ద్భుతంగా విశ్లేషించిన చైతన్యశీల కవి గౌరన.
మల్లన్న, భ్రమరాంబలకే అంకితం
‘నాథ సంప్రదాయం వీరశైవం కన్నా ప్రాచీనమైందని’ చరిత్రకారులు భావించారు. ఈ నాథ సంప్రదాయ ప్రవర్తకులే నవనాథులు. దీని జన్మస్థలం ఉత్తర భారతదేశం. అయితే, 7వ శతాబ్దం నాటికి ఈ నాథ సంప్రదాయం దక్షిణాపథంలో ప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీశైలంలో ప్రవేశించింది. ఈ కారణంగా అక్కడి భిక్షావృత్తి మఠాధిపతి ‘ముక్తి శాంత భిక్షావృత్తి’ ఆదేశంతో శ్రీగిరి కవి పద్యకావ్యం గా ఈ ‘నవనాథ చరిత్ర’ను ఆయన రచించా డు.
ఈ ద్విపద కావ్యాన్ని గౌరన శ్రీశైల మల్లికార్జునికి అంకితమచ్చాడు. ఆరుద్ర అభి ప్రాయపడినట్లు ‘ఆంధ్రుల సాంఘిక విజ్ఞాన విశేషాల్ని తెలియజేయగల కావ్యాలలో గౌరన రచనలు చేరతాయి’ అన్న మాటలు అక్షర సత్యాలు. శ్రీశైలం కొండపై అల్లమప్రభుని (ఈయన చారిత్రక వ్యక్తి)తో వాదించి గోరక్షక నాథుడు ఓటమి పాలయ్యాడు. అయితే, ఈ నాథ సంప్రదాయం శైవంలో ఒక భాగంగా భావించిన గౌరన పరిపూర్ణ శైవుడు కనుక తన కావ్యాన్ని కూడా శ్రీశైల మల్లికార్జున భ్రమరాంబలకే సమర్పించాడు. వారి అనుగ్రహమే ఈ కావ్య రచనకు కారణమని నమ్మిన గొప్ప భక్తుడు గౌరన. ‘ఒక విధంగా ఇది శైవ పురాణమే’ అన్న పింగళి లక్ష్మీకాంతం భావనా సత్యమే.
శైవతత్త మహిమ
శ్రీశైలంలోని ‘శాంతి భిక్షావృత్తి’ రాయాలన్న కోరిక మేరకు రూపొందిన శ్రీగిరి కవి పద్యకావ్యమే గౌరన రచన (నవనాథ చరిత్ర)కు ఆధారమని కూడా ప్రముఖ సాహితీ వేత్తల అభిప్రాయం. ప్రాచీన శైవ తాత్తిక సంప్రదాయాల్లో నాథ స్రంపదాయమూ ఒకటన్న చారిత్రకుల అభిప్రాయాన్ని గౌరన కావ్యం సాగిన కావ్యరీతినిబట్టి అర్థమవుతున్నది. అందుకే, తన కవితా ప్రౌఢిమతో వైవిధ్య భరితమైన ఈ శైవ తత్త మహిమను వివరించే ప్రయత్నం చేశాడు కవి. తాను నివసిస్తున్న దేవరకొండ, రాచకొండ రాజ్యాల్లో వైష్ణవ ప్రాధాన్యం ఉన్నా తాను మాత్రం శైవం పట్లనే మక్కువ చూపి దీనిని శైవతత్త విశేష కావ్యంగానే నిబద్ధించాడు. ఇందులోని కవిత్వ శైలినిబట్టి, ఇంకా కవి చూపిన ప్రౌఢిమనుబట్టి ఇది ఆయన తొలి రచనగానూ పండితులు గుర్తించారు.
సారంగధరుని కథకూ చోటు
రాజయోగ హఠయోగ గతమైన ఆధ్యాత్మ విద్యా రహస్యాలను పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించాడు. ఈ మహావిద్యను శివుడు మత్స్యేంద్ర నాథునికి కూడా బోధించడం ద్వారా సాక్షాత్తు స్వామే ఈయనకు ఉపదేశ గురువయ్యాడు. ఈ మత్స్రేంద్ర నాథుడే మీన నాథుడని కూడా వ్యవహరింపబడ్డాడు. ఈయన నుండి వ్యాళసిద్ధుని వరకు ఈ విద్య సంక్రమించింది. ఈ వివరాలన్నీ ఈ కావ్యంలోని అంశాలే. ఇందులో సారంగధరుని కథ కూడా చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, లోకంలో ప్రచారంలో ఉన్న కథకు ఇది భిన్నంగా ఉంది. మనం వింటున్న కథలో రాజమహేంద్రవర పాలకుడైన రాజరాజ కుమారుడు కాడు, ఈ సారంగధరుడు మాం ధాతపుర పాలకుడైన రాజరాజ కుమారుడు. ఇందులోని చిత్రాంగి ఈ రాజు ఉంపుడుగత్తె. ‘చౌరంగి’గా పిలువబడిన సారంగధరుడు పోగొట్టుకున్న కాళ్లు, చేతులను తిరిగి తెప్పించి రక్షించిన మహనీయుడు మీననాథుడు.
తన కాలంలోని వంచక పురోహితులను గురించి, కుహనా జ్యోతిషులను గురించి, ‘కుక్కచ్చు’ అనే ప్రత్యేక బ్రాహ్మణులకు వేసే నాటి శిక్షను గురించి పలు విశేషాలను అందించిన గౌరన పై మూడు రచనలు తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విశిష్ట కృతులు.
వ్యాసకర్త సెల్: 9949013448
గర్వించదగ్గ రచయిత
అఖండ ప్రతిభామూర్తి గౌరన మహాకవిని గురించి ఆరుద్ర “ప్రాచీన తెలుగు సాహిత్యంలో నాటకా లు ఎవరూ వ్రాయలేదుగాని, ఆద్యులెవరైనా మొదలుపెట్టి సంప్రదా యాన్ని నెలకొల్పితే తెలుగుజాతి గర్వించదగ్గ రచయిత గౌరన. ఆయన హరిశ్చంద్ర కథను, నవనాథుల చరిత్రను ద్విపద కావ్యాలుగా రాశాడు. అవి పేరుకు ద్విపదలైనా కవి వీటిని నాటకాలు వ్రాస్తున్నట్లే రచించాడు. హరిశ్చంద్ర కావ్యంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది..” అన్నారు. గౌరన తన ‘హరిశ్చంద్రోపాఖ్యాన’ కావ్యంలో ప్రదర్శించిన నాటకీయత ఎంత గొప్ప స్థాయి లో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ మాటలు చాలు.
ఒక విధంగా భట్టుమూర్తి రచంచిన ‘హరిశ్చంద్ర నలోపాఖ్యానాని’కి ఈ కావ్యమే స్ఫూర్తినిచ్చిందని కూడా సాహిత్య చరిత్రకారుల భావన. ఆధునిక కాలంలోని ‘సత్యహరిశ్చంద్ర’ నాటకాలకుకూ ఈ కావ్యమే స్ఫూర్తి. ఇందులో కనిపించే నక్షత్రకుడు, కాలకేశికుడు, కలహకంఠి, వీరబాహు వంటి పాత్రలు అవే పేర్లతో కనిపించి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అందు కే, పింగళి లక్ష్మీకాంతం వంటి పండితులు “ఇతని కవితా చమత్కృతి గాంచి కవులందరును శిరఃకంపంబు సేయ పచరించి వీనుల పండువుగా రచియింతు”నన్న కవి మాటలను గౌరవించారు.