calender_icon.png 21 October, 2024 | 4:08 AM

హర్యానా సీఎంగా సైనీ

18-10-2024 01:43:16 AM

చండీగఢ్, అక్టోబర్ 17: హర్యానాలో గురువారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. మాజీ సీఎం నాయబ్‌సింగ్ సైనీ నేతృత్వంలోనే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. అతిరథ మహారథుల మధ్య హర్యానా సీఎంగా నాయబ్‌సింగ్ సైనీ గురువారం ప్రమాణం చేశారు. ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. చండీగఢ్ సమీపంలోని పంచకుల పరేడ్‌గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన క్యాబినెట్ మంత్రులతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల 18 మంది ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వీరిలో ఉన్నారు. 

200 రోజుల్లో రెండోసారి ప్రమాణం

నాయబ్‌సింగ్ సైనీ అరుదైన రికార్డు సొంతం చేసుకొన్నారు. ఒకే ఏడాదిలో ఆయన ఒక రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో అప్పటి హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌ను తప్పించిన బీజేపీ అధిష్ఠానం.. సైనీని సీఎంగా నియమించింది. పదవి చేపట్టిన 200 రోజుల్లోనే వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని మళ్లీ గెలిపించారు. దీంతో హర్యానా చరిత్రలో వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ రికార్డు సృష్టించింది.

ఈ నెల వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 90 సీట్ల అసెంబ్లీలో బీజేపీ 48 గెలిచి సంపూర్ణ మెజారిటీ సాధించింది. సీఎం సైనీతోపాటు 13 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో మాజీ డిఫ్యూటీ సీఎం అనిల్ విజ్‌తోపాటు క్రిష్ణలాల్ పన్వర్, రావ్ నర్బీర్‌సింగ్, మహిపాల్ దండా, విపుల్ గోయల్, రాజేశ్ నాగర్, గౌరవ్ గౌతం, అర్వింద్‌కుమార్ శర్మ, శ్యామ్‌సింగ్ రాణా, రణ్‌బీర్‌సింగ్ గంగ్వా, కృష్ణ బేడీ, ఆర్తీరావ్, శృతి చౌదరి ఉన్నారు. మొత్తం క్యాబినెట్‌లో ఆర్తీరావ్, శృతి మాత్రమే మహిళా మంత్రులు. ఆర్తీరావ్ కేంద్ర మంత్రి రావ్ ఇందర్‌జిత్ సింగ్ కూతురు కాగా, శృతి మాజీ సీఎం బన్సీలాల్ మనుమరాలు.  

ఎన్డీయే బల ప్రదర్శన

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైన నేపథ్యంలో సైనీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎన్డీయే కూటమి తన బలప్రదర్శనకు వేదికగా మార్చుకొన్నది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్‌లాల్ ఖట్టర్ తదితరులతోపాటు ఎన్డీయే పాలిత 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు కూడా హాజరయ్యారు. గురువారమే చండీగఢ్‌లో ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం నిర్వహించారు. దీంతో వారంతా ఈ రెండు కార్యక్రమాలకు హాజరయ్యారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.