* వెన్నెముక, మెడ ప్రాంతం సహా ఆరు చోట్ల కత్తిపోట్లు
* హుటాహుటిన ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలింపు
* శస్త్రచికిత్స ద్వారా 2.5అంగుళాల కత్తి ముక్కను తొలగించిన వైద్యులు
* 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం పోలీసుల గాలింపు
ముంబై, జనవరి 16: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. ముంబై వెస్ట్ బంద్రా ప్రాంతంలోని సద్గురు శరణ్ భవనం ఏడో అంతస్తులో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్న సైఫ్‌పై గురువారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో గుర్తు తెలియని యువకుడు కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో ఆయనకు వెన్నెముక, మెడ, ఎడమ చేయి సహా మొత్తం ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. సైఫ్‌కు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు వెన్నెముక ప్రాంతం నుంచి 2.5అంగుళాల కత్తి ముక్కను తొలగించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న సైఫ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.
దాడిని ఖండించిన సినీ, రాజకీయ ప్రముఖులు
సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిని శివసేన(యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేదీ, కాంగ్రెస్ ఎంపీ వర్షా గైక్వాడ్ ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా కోరుకున్నారు. నటి ఆలీయా భట్, రన్‌బీర్ కపూర్‌లు లీలావతి ఆసుపత్రిని సందర్శించి సైఫ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. నటి రవీనా టాండన్ సైతం ఈ దాడిని ఖండిస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కునాల్ కోహ్లీ ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు.
ముంబై సురక్షితమైన సిటీ
సైఫ్ అలీఖాన్‌పై దాడి నేపథ్యంలో ముంబైలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొట్టిపారేశారు. దేశంలో అన్ని సిటీల్లోకెల్లా ముంబై సురక్షితమైందని పేర్కొన్నారు. ఒక్క సంఘటన ఆధారంగా చేసుకుని ముంబై సురక్షితమైన ప్రాంతం కాదని ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. అలాగే ఈ దాడిపై పోలీసు లు దర్యాప్తు చేస్తున్నారనీ.. తొందరలోనే నిందితుడిని పట్టుకుంటారని పేర్కొన్నారు.
దాడి సమయంలో ఇంట్లోనే కరీనా కపూర్?
భర్త సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన సమయంలో నటి కరీనా కపూర్ ఇంట్లో లేరనే వార్త ప్రచారం అయింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి పార్టీకి వెళ్లినట్టు వార్తలొచ్చాయి. అయితే దాడి సమయంలో ఆమె తన నివాసంలోనే ఉన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ద్వారా తెలుస్తుంది. సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత ఇంటి పరిసరాల్లోనే ఆమె టెన్షన్‌తో అటూ ఇటూ తిరిగినట్లు వీడియోలో ఉంది.
డబ్బుల కోసం దుండగుడి డిమాండ్
సైఫ్ అలీఖాన్‌పై తెల్లవారు జామున 2.30 గంటలకు దాడి జరగ్గా దాదాపు ముప్పు నిమిషాల తర్వాత సమాచారం అందుకున్న పోలీసు లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు న మోదు చేసుకున్న అధికారు లు దొంగతనం కోణం లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది.
దుండగుడు తొలుత సైఫ్ నాలుగేళ్ల కుమారుడు జహంగిర్ ఉన్న గదిలోకి ప్రవేశించినట్టు అక్కడ బాబు ను చూసుకుంటున్న సంరక్షకురాలు ఎలియామా ఫిలిప్స్ పోలీసులకు తెలిపారు. దుండగుడిని అడ్డుకుంటుండగా అత డు తనపై దాడి చేసి కోటి రూ పాయలు డిమాండ్ చేసినట్టు వెల్లడించారు.
దీంతో తాను ఇంట్లో వాళ్లను అప్రమత్తం చేసినట్టు పేర్కొన్నారు. దీంతో సైఫ్ మేల్కొని దుండగుడిని అడ్డుకుంటుండగా దాడికి తెగించినట్టు పోలీసులకు వివరించారు. ఎలియామా ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన తర్వాత సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను పరిశీలించిన అధికారులు.. నిందితుడికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. పోలీసులు విడుదల చేసిన వీడియోలో దుండగుడు భవనంలోని అత్యవసర మెట్ల మార్గం నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు ఉన్నాయి. కాగా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మొత్తం 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.