వివేక్ ఆత్రేయ దర్శకుడిగా రూపొందుతున్న ‘సరిపోదా శనివారం’ సినిమాతో సెప్టెంబర్ 5న తెరమీదికి రానున్నారు హీరో నాని. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకున్న నాని కొంతకాలం పాటు కుటుంబంతో గడపనున్నారు. ఈ క్రమంలో ఆయన అమెరికా ఫ్లుటై ఎక్కనున్నట్టు సమాచారం. కాగా తర్వాతి సినిమా కోసం నాని ఏ దర్శకుడితో కలిసి పని చేయబోతున్నారన్న విషయంలో కొంత గందరగోళం నెలకొని ఉంది. ఈ జాబితాలో దర్శకుడిగా తనకు తొలి చిత్రమైన ‘దసరా’తో నానిని వంద కోట్ల క్లబ్లో చేర్చిన శ్రీకాంత్ ఓదెల ముందున్నారు.
కథా సామగ్రి ఇప్పటికే సిద్ధం చేసిన శ్రీకాంత్ ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాల్లో చురుకుగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ‘సరిపోదా..’ తర్వాత నాని ‘బలగం’ వేణుతో సినిమా చేయనున్నట్టు చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అయితే ఆ సినిమాపై ఎలాంటి సమాచారం రాకపోగా.. ఇప్పట్లో ఆ కలయిక ఉండదని గుసగుసలు మొదలయ్యాయి. కథాపరమైన అడ్డంకులే ఇందుకు కారణమట. పవన్ని ‘ఓజీ’గా చూపించనున్న సుజిత్ కూడా నానితో సినిమా పట్టాలెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. నాని కూడా ఇందుకు సముఖంగా ఉన్నా.. దీనికింకా సమయముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘హిట్’ సీక్వెల్ కోసం శైలేష్ కొలను కూడా ఈ వరుసలో వేచి ఉన్నారు. ఇలా చాలామంది దర్శకులు నానితో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. ప్రస్తుతానికి ఆయన ఓకే చెప్పింది మాత్రం ఓదెలకే. మిగిలిన వారిలో ఎవరి పేరు ముందు పోస్టర్ మీద పడుతుందో మరి..!