calender_icon.png 22 October, 2024 | 11:39 PM

అతనెళ్ళి పోయాడు..!

21-10-2024 10:51:42 PM

చావును నిరాకరిస్తున్నానని..

రాజ్య కర్కశత్వాన్ని అండా సెల్లో          

పాతరేసి, పాశవిక దశాబ్ది

నిర్బంధాన్ని కూలదోసి

న్యాయదేవత సాక్షిగా ..

అతనొక ఎగరేసిన ఎర్ర పతంగిలా

అతనెళ్ళి పోయాడు..!

కాళ్ళుండి కదలలేని 

మనుషుల మధ్య 

మెదడుండి కదలిక లేని, 

కళ్ళుండి చూడలేని మానసిక అంధత్వాన్ని ఛేదించుకుని..

సృష్టి రహస్యాన్ని విప్పిన 

స్టీఫెన్ హాకింగ్‌లా 

ప్రజల కన్నీళ్ళకు కారణమైన 

కార్పొరేట్ పాలకవర్గ దోపిడీ

పీడనల్ని పసిగట్టిన వేగుచుక్కై.. 

అతనెళ్ళి పోయాడు!

చావును నిరాకరిస్తున్నానని..

మొలకెత్తే గడ్డి సవ్వడుల్ని 

వినగలిగిన వాడు

విశాల ప్రజాఐక్య 

పోరాటాలకు ఊపిరైనోడు..

అతనెళ్ళి పోయాడు..!

చావును నిరాకరిస్తున్నానని..!!

అమలాపురం నుండి 

తెలంగాణ కొచ్చినోడు..

ఆంధ్ర వలసాధిపత్యాన్ని ధిక్కరించి

తెలంగాణ జనసభై 

ప్రజాస్వామిక స్వప్నాన్ని 

ఎలుగెత్తి చాటినోడు.. 

ప్రజల ప్రతిఘటనా పోరాటాల్ని 

విశాల వేదికలకు అజెండాగా మార్చి.. అతనెళ్ళి పోయాడు!

అఖండ భారత ఆధిపత్యం కింద 

నలిగిపోయే విభిన్న జాతుల 

పోరాటాలకు పాఠమైనోడు..

తరగతి గదిలో 

చక్రాల కుర్చీలోంచి 

దేశ భవిష్యత్తుని 

బోధించిన ఆదర్శ ఆచార్యుడు..

అతనెళ్ళి పోయాడు..

అతను బాబాల్లాగా ప్రజల్ని 

మోసగించినోడు కాదు..

పచ్చని అడవుల్ని నరికేసే 

గ్రీన్ హుంటుల్ని

దేశ సంపదల్ని కాపాడే 

ఆదివాసీలను 

అంతం చేసే కగార్ యుద్ధాల్ని వ్యతిరేకించినోడు..

అతనెళ్లి పోయాడు..

అతనెళ్లి పోయిన 

దారి ముందు.. 

మనమున్నాం!!

 ప్రభాకర్ కస్తూరి