స్టార్ హీరోలు మ్యూజిక్ వీడియో సాంగ్స్‌లో కనిపించడం అనే ట్రెండ్ బాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్‌తోపాటు పలువురు స్టార్ హీరోలు ఆడపాదడపా వీడియో సాంగ్స్‌తో అభిమానులను అలరిస్తుంటారు. బాలీవుడ్ హీరోల బాటలో ఇప్పుడు టాలీవుడ్ కథానాయకుడు విజయ్ దేవరకొండ అడుగులు వేయనున్నాడు. తన కెరీర్‌లో తొలిసారి హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. తద్వారా మ్యూజిక్ వీడియో సాంగ్‌లో కనిపించనున్న ఫస్ట్ టాలీవుడ్ స్టార్ హీరో కానున్నాడాయన.
‘సాహిబా’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ వీడియో సాంగ్‌లో విజయ్‌కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ కనిపించబోతోంది. ఆదిత్య శర్మ, ప్రియా సారియా సాహిత్యం అందించిన ఈ గీతానికి ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ జస్లీన్ రాయల్ ఆలపిస్తూ, మ్యూజిక్ అందిస్తోంది. సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తున్న ఈ వీడియో సాంగ్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. పోస్టర్‌లో వీరిద్దరి రొమాంటిక్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
త్వరలోనే ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తున్నాడు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై యాక్షన్ చిత్రం షూటింగ్ జరుగుతోంది. విజయ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 28న విడుదల కానుందీ చిత్రం.