12-02-2025 08:16:50 PM
భద్రాచలం (విజయక్రాంతి): శ్రీ సీతా రామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామి వారి ఉత్సవ మూర్తులకు బుధవారం ఘనంగా అర్చకస్వాములు సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని జరిగే ఈ క్రతువుకు సోమవారం అర్చకస్వాములు అంకురార్పణ చేయగా మంగళవారం సహస్త్ర కలశ స్థాపన, కలశ ఆవాహనం, అగ్నిప్రతిష్టాపన, సాయంత్రం వాస్తుపూజ కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ తరుణంలో బుధవారం శ్రీస్వామి వారి ఉత్సవ మూర్తులను అంతరాలయం నుంచి మేళతాళాల నడుమ పల్లకీలో భక్తుల జయ జయ ధ్వానాల నడుమ తీసుకుని వచ్చి బేడా మండపంలో ఆశీనులు చేశారు.
అనంతరం వేదపండితులు, అర్చకస్వాముల వేదమంత్రాల నడుమ శ్రీస్వామి వారికి 1000ల కలశాలతో సహస్త్ర కలశాభిషేకం క్రతువును వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, మహానివేదన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు రామచంద్రస్వామి వారి ఆరాధ్య దైవమైన రంగనాథుడి వార్షిక కళ్యాణం గుట్టపై గల శ్రీరామదాసు ధ్యాన మందిరం వద్ద గల రంగనాధ. స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని అనేక మంది భక్తులు పాల్గొని దర్శించి తరించారు. కార్యక్రమాలను దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎల్.రమాదేవి పర్యవేక్షించారు.