07-03-2025 12:00:00 AM
పోలీసులకు, మీడియాకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తామని డిపాజిటర్లతో వెల్లడించిన మేనేజర్
గజ్వేల్, మార్చి6: సహారా ఇండియా సంస్థపై కోర్టుల్లో కేసులు కొనసాగుతున్నా ఏజెంట్లు మాత్రం డిపాజిట్లు సేకరించడంపై గురువారం విజయక్రాంతిలో ప్రచురితమైన వార్త కథనంతో గ్రామీణ ప్రాంతాల్లోని డిపాజిటర్లు గజ్వేల్ లోని సహారా ఇండియా కార్యాలయాన్ని సంప్రదించేందుకు వెళ్లారు. ఏజెంట్ల నమ్మబలికే మాటలతో మోసపోతున్నామని అర్థం చేసుకున్న డిపాజిటర్లు సహారా ఇండియా గజ్వేల్ మేనేజర్ కు, ఏజెంట్లకు ఫోన్లు చేస్తూ తమ డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలంటూ కోరుతున్నారు. దీంతో గురువారం గజ్వేల్ లోని కార్యాలయాన్ని మూసివేశారు.
అధిక సంఖ్యలో డిపాజిటర్లు గజ్వేల్ కార్యాలయంలో పూర్తయిన పాలసీల డబ్బులు అడగడానికి రాగా కార్యాలయం మూసి ఉండడంతో పాటు మేనేజర్, ఏజెంట్లు కూడా స్పందించకపోవడంతో చేసేదేమీ లేక తిరిగి వెళ్ళిపోయారు. గత కొద్ది రోజుల క్రితం ముగిసిన పాలసీ డబ్బులను ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని నెంటూరు గ్రామానికి చెందిన డిపాజిటర్లు మేనేజర్ అశోక్ తో మాట్లాడగా, పోలీసులకు, మీడియాకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తామని, అప్పుడు మీకు చెప్పుకునే గతి ఏది ఉండదు అంటూ మేనేజర్ అశోక్ బెదిరించినట్లు డిపాజిటర్ వెల్లడించారు. అప్పటికి ఓ తెల్ల కాగితంపై సంతకం, స్టాంపు వేసి ఇచ్చి కొద్ది రోజులకు రమ్మన్నారని, మళ్లీ వస్తే కూడా తర్వాత డబ్బులు ఇస్తామంటూ చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిపాజిటర్లంతా ఏజెంట్ల మాయమాటలు నమ్మి మోసపోయామని, శుక్రవారం గజ్వేల్ లో పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు డిపాజిటర్లు చెప్పారు.