calender_icon.png 23 December, 2024 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

200 టీఎంసీలు దాటిన సాగర్

03-08-2024 03:01:28 AM

  1. ఇప్పటికే 550 అడుగులకుపైగా నీటిమట్టం 
  2. 5న సాగర్ క్రస్టుగేట్లు ఎత్తే అవకాశం 
  3. శ్రీరాం సాగర్‌కు కొనసాగుతున్న వరద

హైదరాబాద్/నాగర్‌కర్నూల్/నల్లగొండ/గద్వాల(వనపర్తి), ఆగస్టు 2 (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల నుంచి జూరాలకు వరద జోరు కొనసాగుతున్నది. శుక్రవారం 3.50లక్షల క్యూసెక్యుల వరద నీరు జూరాలకు రాగా 45 గేట్ల నుంచి 3,24,921 క్యూసెక్యుల వరద నీరు శ్రీశైల జలాశయానికి పరుగులు పెట్టింది. శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరదతో శుక్రవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఈ సీజన్‌లో మొదటిసారి 200 టీఎంసీల మార్కును దాటింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10గేట్లు 20ఫీట్ల మేర ఎత్తి సాగర్‌కు 5.60లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదైంది. శనివారం నాటికి ఈ ప్రవాహం సాగర్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది.

సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.5050 టీఎంసీలు) కాగా ప్రసుత్తం 550.60 అడుగులు (211.1018 టీఎంసీలకు) చేరింది. ప్రవాహం ఇదే రీతిన కొనసాగితే 5వ తేదీ నాటికి జలాశయం పూర్తిస్థాయిలో నిండి, క్రస్టుగేట్లు ఎత్తే అవకాశాలున్నాయని నీటి పారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి వరద ఆశాజనకంగా ఉండటంతో తెలంగాణలో కృష్ణ పరివాహక ప్రాజెక్టులన్నీ కళకళలాడుతున్నాయి.

రాష్ట్రంలో గోదావరిపై ఉన్న మొదటి ప్రాజెక్టు శ్రీరాం సాగర్‌కు శుక్రవారం కూడా ఓ మోస్తరు వరద కొనసా గింది. శ్రీరాం సాగర్‌కు 52,164 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవ్వగా... ప్రాజెక్టు 41.14 టీఎంసీల స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం దాదాపుగా సగం రిజర్వాయర్ నిండిందని ఇదే విధంగా వరద కొనసాగితే ప్రాజెక్టు త్వరగా నిండేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

కాళేశ్వరంలో శాంతించిన గోదారమ్మ

జయశంకర్ భూపాలపల్లి(విజయక్రాంతి): గత రెండు రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ శుక్రవారం శాంతించింది. శుక్రవారం సాయంత్రం వరకు కాళేశ్వరం గోదావరి పుష్కరఘాట్ వద్ద 8మీటర్ల మేర ప్రవహించింది. మేడిగడ్డ బరాజ్‌కు సైతం వరద ఉధృతి తగ్గింది. శుక్రవారం సాయంత్రం వరకు 3.30లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా అదే స్థాయిలో దిగువకు నీటిని వదిలారు. 

పాతాల గంగలో వ్యక్తి గల్లంతు

నాగర్‌కర్నూల్(విజయక్రాంతి):నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన చొప్పరి యాదయ్య తోటి స్నేహితులతో కలిసి శ్రీశైల దర్శనానికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం పాతాల గంగ వద్ద స్నానం చేస్తుండగా వరద తాకిడికి నీటిలో కొట్టుపోయినట్లు స్థానికులు తెలిపారు.