- శ్రీశైలం ఔట్ ఫ్లో 5,18,202 క్యూసెక్కులు
- తొలిసారి శ్రీరాంసాగర్‌కు పెరిగిన వరద
హైదరాబాద్/గద్వాల(వనపర్తి), ఆగస్టు 1 (విజయక్రాంతి): ఎగువ ప్రాంతాల నుంచి జూరాలకు గురువారం 3 లక్షల 15 వేల క్యూసెక్యుల వరద నీరు వచ్చింది. 42 గేట్ల నుంచి 2,80,908 క్యూసెక్యుల నీటిని శ్రీశైలం వైపు పంపించారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గురువారం భారీగా వరద పోటెత్తింది. ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు ఔట్ ఫ్లో 5,18,202 క్యూసెక్కులుగా నమోదైంది.
10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి 4,30,790 క్యూసెక్కులను దిగువనకు వదులుతున్నారు. శ్రీశైలం నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో సాగర్ నీటి మట్టం 182.95 టీఎంసీలకు చేరుకుంది. ఈ సీజన్‌లో గోదావరి నదికి ఎగువన తొలిసారిగా చెప్పుకోదగ్గ వరద వచ్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 40,786 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవ్వగా... ప్రాజెక్టు 37.11 టీఎంసీలకు చేరుకుంది.
మేడిగడ్డ బరాజ్‌కు తగ్గిన వరద
జయశంకర్ భూపాలపల్లి: వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరితో పాటు మేడిగడ్డ బరాజ్‌కు వరద ఉధృతి తగ్గింది. గురువారం సాయంత్రం వరకు మహాదేవ్‌పూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 8.9మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ బరాజ్‌కు సైతం వరద తగ్గడంతో గురువారం 3.62 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 85గేట్లు ఎత్తి అదే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు.