- ప్రశ్నార్థకంగా వానకాలం సాగు
- నార్లు పోసేందుకు రైతుల సంశయం
- వర్షాల కోసం ఎదురు చూపు
- మరో రెండు నెలలు వానలు పడకపోతే తాగునీటికీ తిప్పలే..
నల్లగొండ, జూలై ౩ (విజయక్రాంతి): నాగార్జున సాగర్ ఆయకట్టులో వానకాలం సాగు సైతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టులో నీటి నిల్వలు అడుగంటడంతో పంటల సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. సాగ ర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 504 అడుగులు (112 టీఎంసీలకు) పడిపోయింది. ప్రాజెక్టు నీటిమట్టం 510 అడుగులకు చేరితే డెడ్ స్టోరేజీగా పరిగణిస్తారు. కృష్ణా బేసిన్ పరివాహక ప్రాంతా ల్లో ఆశించిన మేర వర్షాలు కురకపోవడం తో ఎగువ ప్రాజెక్టుల్లో నుంచి ప్రవాహం లేక నాగార్జున సాగర్‌లోకి ఇప్పటి వరకు చుక్కనీరు చేరలేదు.
దీంతో ఎన్నడూలేని విధంగా ప్రాజెక్టు నీటిమట్టం డెడ్ స్టోరేజ్ కంటే దిగువకు చేరింది. నిరుటి డిసెంబర్ నాటికి ప్రాజె క్టులో సుమారు 522 అడుగులకుపైగా నీరుంది. అయినా, హైదరాబాద్‌కు తాగునీరు, ఇతర అవసరాలు దృష్టిలో ఉంచుకొని యాసంగిలో ఆయకట్టు పరిధిలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. కానీ, రైతులు పట్టించుకోకుండా బోరుబావుల ఆధారంగా లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సాగర్ నీరు రాకపోవడం, తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు అడుగంటి చాలా చోట్ల పొలాలు ఎండిపోయి అన్నదాతలు తీవ్ర నష్టం చవి చూశారు.
22 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం
ఉమ్మడి రాష్ట్రంలో సాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలో 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. తెలంగాణలోని ఎడమ కాల్వ పరిధిలో నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 7.20 లక్షలు, ఏపీలోని కుడి కాల్వ పరిధిలో కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 15 లక్షల ఎకరాలు సాగవుతోంది. ఏడాదిగా సాగర్ ప్రాజెక్టులో ఆశించిన మేర నీరు లేకపోవడంతో సాగునీటి కోసం ఇబ్బందిపడ్డ రైతులు వాన కాలం సాగుకైనా నీరందంక పోతుందా? అని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులు వారిని నిరాశకు గురి చేస్తున్నాయి. ప్రాజెక్టు నీటిమట్టం ఏకంగా డెడ్ స్టోరేజ్ కంటే 6 అడుగుల దిగువకు చేర డం, ఎగువ నుంచి ప్రవాహం లేకపోవడం తో బోరుబావుల ఆధారంగానూ నార్లు పోసుకునేందుకు వెనుకాముందాడుతున్నారు.
తాగునీటికీ కష్టమే..
మరో రెండు నెలలపాటు కృష్ణా బేసిన్‌లో వర్షాలు కురువకపోతే సాగర్‌లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోవడం కష్టమే. 490 అడుగుల వరకు అత్యవసర మోటర్ల సాయంతో తాగునీటిని తీసుకోవచ్చు. సాగర్ నుంచి హైదరాబాద్, నల్లగొం డ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరా నిత్యం కొనసాగుతోంది. రిజర్వాయ ర్ బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగడి వద్ద ఉన్న ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ద్వారా 800 క్యూసెక్టుల నీటిని ఏకేబీఆర్ (అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)లోకి మోటర్ల ద్వారా ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి 550 క్యూసెక్కులు జంట నగరాలకు పంపుతున్నా రు. మరో 250 క్యూసెక్కులు నల్లగొండలోని గ్రామాలకుపైగా సరఫరా చేస్తున్నారు.
సాగర్ నిండితేనే సాగు చేసేది
ఏడాదిగా సాగు నీరు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. సకాలంలో వానలు పడకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు పోయక యాసంగి సాగు చేసిన పంట ఎండిపోయింది. ప్రస్తుతం బోరుబావులను నమ్ముకొని వ్యవసాయం చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడా చెరువులు, కుంటల్లో చుక్కనీరు కనిపించడం లేదు. వర్షాలు కురిసి సాగర్ నిండితేనే పంట సాగు చేస్తాం.
కాంసాని శ్రీనివాస్, హజారిగూడెం రైతు, అనుముల మండలం