calender_icon.png 30 October, 2024 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మై ఆటో ఈజ్ సేఫ్’తో భద్రత

07-07-2024 12:05:00 AM

  1. ఆటోలకు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు
  2. స్కాన్ చేస్తే పూర్తి వివరాలు పోలీసులకు..
  3. ఆపదని తెలిస్తే వెంటనే రంగంలోకి

జహీరాబాద్, జూలై ౬: ఆటోలలో చిన్నారులు, విద్యార్థులు, యువతులు, మహిళలు ఒంటరిగా వెళ్లాలంటే ఒక విధమైన భయం ఉండేది. ఎందుకంటే ఆటో డ్రైవర్ల ప్రవర్తన ఎలా ఉంటుందోననే సందేహం వారిలో ఉండేది. ప్రజల్లో ఆటో డ్రైవర్లపై ఉన్న సందేహాలను పోగొట్టడానికి పోలీసులు ఆటో డ్రైవర్లకు సాంకేతికతను అందిపుచ్చారు. తమ పర్యవేక్షణలో ఆటోలలో ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే విధంగా ‘మై ఆటో ఈజ్ సేఫ్ యాప్’ను అందుబాటులోకి తెచ్చారు. సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్ ఆదేశాల మేరకు జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, హద్నూర్, కోహీర్, చిరాగ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పోలీసులు ఆటోలకు మై ఆటో ఈజ్ సేఫ్ స్టిక్కర్లు అతికించి, అవగాహన కల్పిస్తున్నారు. 

క్యూఆర్ కోడ్‌తో ప్రయోజనాలు

ఆటోకు ఉన్న ‘మై ఆటో ఈజ్ సేఫ్’ క్యూఆర్ కోడ్‌ను ప్రయాణికులు తమ స్మార్ట్‌ఫోన్‌లో స్కాన్ చేస్తే jgd.safe. gadi.com అనే ఆప్షన్ వస్తుంది. ఆ లింక్‌ను క్లిక్ చేయగానే ఆటోలో ప్రయాణం ఎలా సాగుతుందో వివరాలు చూపుతుంది. తమ ప్రయాణం అనుభూతి ఎలా ఉందో, ఆటో డ్రైవర్ ప్రవర్తన ఎలా ఉందో అందు లో నమోదు చేయవచ్చు. ఆ వివరాలు పోలీసు యంత్రాగానికి సాంకేతిక అధారంగా తెలిసిపోతాయి. సురక్షితంగా ప్రయా ణం సాగుతుందా? ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటున్నారా అనే విషయాలను పోలీసులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ వల్ల డ్రైవర్ల పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఆటోలో ప్రయాణించే సమయంలో వస్తువులు మరిచిపోతే కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. 

భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యం

జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జహీరాబాద్ డివిజన్ పరిధిలోని గ్రామాల్లో ఆటోలో ప్రయాణించే వారికి భద్రత, భరోసాను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆటోలలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ‘మై ఆటో ఈజ్ సేఫ్’ అనే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకోవాలి. ఆటో డ్రైవర్ వివరాలు మొత్తం కోడ్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ప్రయాణించేటప్పుడు ఏదైన అపద వచ్చినా పోలీసుల సేవలు తక్షణం పొందేందుకు వీలుంటుంది. 

 రామోహ్మన్‌రెడ్డి, డీఎస్పీ, జహీరాబాద్ (సంగారెడ్డి)

సురక్షితంగా వెళ్తామన్న నమ్మకం ఏర్పడింది

మై ఆటో ఈజ్ సేఫ్ యాప్, క్యూఆర్ కోడ్‌ను తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. గతంలో ఆటోలో చిన్నారులు, విద్యార్థులు, యువతులు, మహిళలు ప్రయాణించాలంటే భయపడేవారు. పోలీసులు భద్రత, భరోసాను కల్పించేలా చర్యలు తీసుకోవడంతో నమ్మకం ఏర్పడింది. ఆటలోలో ఇకపై ఎక్కడికైనా సురక్షితంగా గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు. 

 శంభునోల నర్సారెడ్డి, హద్నూర్ (న్యాల్‌కల్ మండలం)