calender_icon.png 27 October, 2024 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్ మెయిన్స్‌లో భద్రత డొల్ల!

27-10-2024 02:12:15 AM

కాపీయింగ్‌తో పట్టుబడుతున్న అభ్యర్థులు

నారాయణమ్మ కాలేజీలో చిట్టీలు తీసుకొచ్చిన అభ్యర్థి

సీవీఆర్ కాలేజీ ఘటన మరవకముందే మరోచోట

ఓ ప్రశ్న తప్పుగా అడిగారంటున్న అభ్యర్థులు

నేటితో ముగియనున్న గ్రూప్ మెయిన్స్ 

హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): గ్రూప్ మెయిన్స్ పరీక్ష నిర్వహణ లో భద్రత డొల్లతనంగా కనిపిస్తుందని అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. శుక్రవా రం ఇబ్రహీంపట్నం సీవీఆర్ కాలేజీలోని పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థిని కాపీయింగ్‌కు పాల్పడిన ఘటన మరువకముందే శనివారం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని నారాయణమ్మ కాలేజీలో ఓ అభ్యర్థి చిట్టీలు తీసుకొచ్చినట్లు సమాచారం. పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బంది సరిగా తనిఖీలు చేపట్టకపోవడంతోనే అభ్యర్థులు కాపీయింగ్‌కు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా కాపీయింగ్ జరిగిన ఘటనపై టీజీపీఎస్సీ అధికారులు స్పష్టతనిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు.

నారా యణమ్మ కాలేజీలో ఓ అభ్యర్థి చిట్టీలు తీసుకొచ్చినట్లు గుర్తించి పరీక్ష రాసేందుకు అనుమతించలేదని, మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. శనివారం పేపర్ భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, డాటా ఇంటర్‌ప్రిటేషన్ పరీక్షను నిర్వ హించారు. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి గగన్‌యాన్ మానవ రహితయాత్ర గురించి ఓ 10 మార్కుల ప్రశ్నను అడిగినట్లు అభ్యర్థులు వాపోతున్నారు.

గగన్‌యాన్ మానవ రహితయాత్రను చేపట్టాలని రెండేళ్ల క్రితం అనుకున్నారని, కానీ ప్రస్తుతం గగన్ యాన్ మానవసహిత (మనుషులను పంపించేది) యాత్రను చేపట్టాలని ఇస్రో భావిస్తున్నట్లు చెప్పారు. అలాంటప్పుడు ఆ ప్రశ్న గురించి రాయమని ఎలా అడుగుతారని అభ్యర్థులు ప్రశ్నించారు. రెండేళ్ల క్రితం రూపొందించిన పాత సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగారని అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. 

తగ్గిన పోటీ..

ఆదివారం జరిగే పేపర్ (తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు) పరీక్షతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ముగియనున్నాయి. మొత్తం 31,383 మంది మెయిన్స్‌కు ఎంపిక కాగా, వారిలో ప్రస్తుతం పరీక్ష రాస్తున్న వారి సంఖ్య 22 వేలు కూడా దాటడం లేదు. శనివారం జరిగిన పరీక్షకు 21,181 (67.4శాతం) మంది హాజరయ్యారు. పోస్టులకు 1:50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయగా, ప్రస్తుతం 1: 37 పోటీ ఉంది.