- విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా చర్యలు
- ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసుల భాగస్వామ్యం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకోసం పోలీసు, టీజీఏఎన్‌బీ, ఎక్సైజ్‌శాఖతో మత్తు పదార్థాలపై నిఘా ఉంచుతోంది. పల్లె, పట్నం, గుడి, బడి అనే తేడా లేకుండా పలువురు అక్రమార్కులు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నారు.
తెలిసో తెలియకో విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలను అరికట్టడంలో విద్యాశాఖను కూడా ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తోంది. ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది.
అందుకోసం ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలు, జూనియర్ కాలేజీల్లో ప్రహరీ క్లబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లాలోని 183 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేసేందుకు జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఈ పాఠశాలల్లో దాదాపు 50 వేల మంది విద్యార్థులున్నారు.
అలాగే జిల్లాలోని ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు దాదాపు 2,262 ఉండగా వాటిలో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే 22 ప్రభుత్వ, 14 ఎయిడెడ్, 250 ప్రైవేటు జూనియర్ కాలేజీలున్నాయి. వాటిలోనూ ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంతో జిల్లాలోని విద్యార్థులకు మత్తు పదార్థాలతో జరి గే నష్టాలను వివరిస్తారు.
విద్యార్థులకు అవగాహన
కొంతకాలం క్రితం ఖైరతాబాద్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థుల వద్ద ఉన్న చాక్లెట్లను పరిశీలించిన ఉపాధ్యా యులు అవి గంజాయి చాక్లెట్లుగా గుర్తించారు. నాంపల్లి లోని మరో పాఠశాలలో విద్యార్థుల వద్ద ఈ సిగరెట్స్ లభించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి.
బయటికి రాని ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఇక ప్రైవేటు విద్యాసంస్థల్లో లెక్కే లేదు అని విమర్శలున్నాయి. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు, విద్యార్థులు మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా ఉండేలా ప్రభుత్వం ప్రహరీ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయి ంచింది.
ఈ ప్రహరీ క్లబ్‌ల ఏర్పాటు, వాటి పనితీరును పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో ఒక కోఆర్డినేటర్ కూడా పని చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రహరీ క్లబ్‌ల పనితీరును పరిశీలిస్తారు. ప్రహరీ క్లబ్‌ల ప్రాముఖ్యత, మత్తు పదార్థాల నిషేధం ఆవశ్యకతపై పోలీసు, టీజీఏఎన్‌బీ ఆధ్వర్యంలో అక్టోబర్ 23, 24, 25 తేదీల్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లాలోని పలువురు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు , అధ్యాపకులు కూడా పాల్గొన్నారు.
కమిటీల ఏర్పాటు ఇలా
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేసే ప్రహరీ క్లబ్‌లలో స్థానిక ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్, చొరవ ఉండే ఒక టీచర్, 6-10 తరగతి, ఇంటర్మీడియట్ వరకు ప్రతి తరగతి నుంచి ఇద్దరు చొప్పున విద్యార్థులు, స్థానికంగా విధులు నిర్వహించే ఒక పోలీస్, ఎస్‌హెచ్‌జీ సభ్యులు కమిటీ సభ్యులుగా ఉంటారు.
విద్యాసంస్థలకు దగ్గరలో మత్తు పదార్థాల వినియోగం, విక్రయం వంటివి జరిగితే వెంటనే పోలీసులకు సమాచా రాన్ని అందిస్తారు. ఎవరైనా విద్యార్థులు డ్రగ్స్ బారినపడినట్లు వారి దృష్టికి వస్తే కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. ఈ కమిటీల్లోని సభ్యులు, విద్యార్థులకు 1908 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడంపై అవగాహన కల్పిస్తారు.