18-04-2025 12:00:00 AM
దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలనను ప్రతిబిం బించే ప్రాచీన వారసత్వ కట్టడాలు ప్రపంచవ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి(ఐరాస)కి చెందిన యునెస్కో ఆ ప్రదేశాలను గుర్తిస్తూ ఉంటుంది. ఆయా దేశాలలోని వారసత్వ సంపద పరిరక్షణ కోసం ఐరాసతోపాటు అంతర్జాతీయ పు రాతన కట్టడాలు, స్థలాల పరిరక్షణ సంఘం సంయుక్తంగా ఆఫ్రికాలోని ట్యునీషియాలో 1982 ఏప్రిల్ 18న సమావేశం అయ్యాయి.
ఆ సమావేశం జరిగిన రోజునే ప్రతి ఏడూ ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’ జరుపుకుంటాం. ఈ ఏడాది ‘హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్ అండ్ కాన్‌ఫ్లిక్ట్స్: ప్రిపేర్డ్‌నెస్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ 60 ఇయర్స్ ఆఫ్ ఐసీవోఎంవోఎస్ యాక్షన్స్’ (విపత్తులు, సంఘర్షణల ముప్పులో వారసత్వ సంపద: 60 ఏళ్ల ‘ఐకోమోస్’ చర్యలనుంచి గ్రహింపు, సంసిద్ధత) అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరగనుంది.
మానవాళికి అత్యుత్తమ విలువగా పరిగణించే విలక్షణమైన, సాంస్కృతిక లేదా భౌతిక ప్రాముఖ్య తగల ప్రదేశాలను యు నెస్కో గుర్తించి ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరుస్తుంది. ముఖ్యంగా వివిధ దేశాలకు చెందిన వైవిధ్యమైన అడవులు, పర్వతాలు, సరస్సులు, ఎడారులు, కట్టడాలు, నగరాలు వంటివి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చోటు దక్కించుకుంటాయి.
ఒక దేశ సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ, ఆ వారసత్వాన్ని భావితరాలకు అం దించే ఉద్దేశ్యంతో యునెస్కో పని చేస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 993 సాంస్కృతిక, 227 సహజ సిద్ధ, 39 మిశ్రమ స్థలాలను ఈ సంస్థ గుర్తించింది. ఇందులో 42 ప్రదేశాలు భారతదేశంలో ఉన్నాయి. దీంతో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు కలిగిన దేశాల జాబితాలో భారత్ ఆరవ స్థానాన్ని ఆక్రమించింది.
మన దేశంలో పురాతన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వారసత్వ ప్రదేశా లు అనేకం ఉన్నాయి. సింధు నాగరికత, బౌద్ధ ఆరామాలు వంటివి ఇందుకు ఉదహరణ. మొదటగా అశోకుని కాలం నుంచే చారిత్రక నిర్మాణాలు, శిల్పకళా సంపదకు పునాదులు పడ్డాయని కొందరి అభిప్రా యం. రాజుల కాలం నాటి శిలా శాసనాలు, గుహలు, దేవాలయాలు, కోటలు మన చారిత్రక వారసత్వ సంపదకు గొప్ప నిదర్శనాలుగా నిలుస్తున్నాయి.
గుజరాత్‌లోని ధోలావీరా అనే ప్రదేశానికి 2021లో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ధోలావీరా ప్రదేశం సింధులోయ నాగరికతకు సాక్ష్యంగా నిలుస్తుంది. తెలంగాణలో ని ప్రాచీన రామప్ప దేవాలయానికి కూడా ఈ హోదా లభించింది. రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతి నికేతన్, కర్ణాటకలోని హోయసల దేవాలయం గతేడాది ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరాయి.
ఆపాటి శ్రద్ధ ఉండాలి కదా!
భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన తాజ్‌మహల్, అజంతా, ఎల్లోరా గుహలు, హంపీ, కోణార్క్ సూర్య దేవాలయం, పశ్చిమ కనుమలు, ఎర్రకోట, కజిరంగా అభయారణ్యం, కాంచన్‌జంగా జాతీయ పార్కు వంటివి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించడం మనకు దక్కిన గర్వకారణంగా చెప్పుకోవచ్చు.
ఇది ఆనాటి కాకతీయుల వాస్తు, శిల్పరీతికి నిదర్శనం. నేడు భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు, కళా వైభవానికి పట్టుకొమ్మలుగా నిలిచిన పురాతన కట్టడాలు వివిధ కారణాలతో కళ తప్పుతున్నాయి. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, కాలుష్యం, అక్రమ నిర్మాణాలు, భద్రతా లేమి, సహజ విపత్తులు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటివి దీనికి ప్రధాన కారణాలు.
నిర్లక్ష్యం, కాలుష్యాలు ఆగ్రాలో పాలరాతితో నిర్మించిన తాజ్‌మహల్ మనుగడకే ముప్పుగా మారాయి. దీని సంరక్షణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ కేంద్ర, రాష్ట్రాల అధికారులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వరంగల్‌లోని రామప్ప దేవాలయానికి కూడా సింగరేణి కాలరీస్ ఓపెన్ కాస్టింగ్ పనులతో ప్రమాదం పొంచి ఉంది.
దీన్నిబట్టి మన దేశంలో పురాతన ప్రదేశాల నమోదు, పరిరక్షిణపై నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, పురావస్తు శాఖపై కూడా చిన్నచూపు ఉంది. భారతీయులకు తమ ఇతిహాసాల మీద ఉన్న శ్రద్ధ చరిత్ర మీద లేదనే మాటలు వినిపిస్తున్నాయి. వారసత్వ సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాజ్యాంగం పేర్కొంది.
శ్రమజీవులకు ఉచిత సందర్శన
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారసత్వ ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా గుర్తిస్తూ, ఆర్థిక వనరులుగా మార్చే ప్రయ త్నం చేస్తున్నది. వారసత్వ కట్టడాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2015లో ‘హృదయ్’ (హెచ్‌ఆర్‌ఐడీఎవై: హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన) కార్యక్రమాన్ని ప్రారంభిం చింది. ఈ క్రమంలోనే గతేడాది ‘అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0’కూ శ్రీకారం చుట్టింది.
ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రైవేట్ - భాగస్వామ్యంతో స్మారక కట్టడాల అభివృద్ధికి ప్రభుత్వం తన వంతు కృషి చేస్తున్నది. అయితే, మన పురాతన కట్టడాలను పేద, మధ్యతరగతి కుటుంబాలు వీక్షించేందుకు అవకాశం లేకుండా పోతున్నది. ప్రయాణ, వసతి ఖర్చులే దీనికి ప్రధాన కారణం. వాస్తవంగా ఆలోచిస్తే పురాతన కట్టడాల్లో కోట్లా దిమంది పేదప్రజల శ్రమ దాగి వుంది.
ఈ విషయాన్ని గుర్తించి స్మారక కట్టడాలను పేద ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రభుత్వాలు కొత్త పథకాలను ప్రవేశపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గొప్ప చరిత్ర కలిగి ఇంకా వెలుగులోకి రాని చారిత్రక కట్టడాలు మన దేశంలో అనేకం ఉన్నాయి.
అందువల్ల ప్రపంచ దేశాల సమన్వయంతో వాటిని గుర్తించి, సంరక్షించేందుకు కృషి చేయాలి. ‘ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ కూడా ఆ వైపుగా చర్యలు చేపట్టాలి. తద్వారా దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి వీలవుతుంది. అంతర్జాతీయ పర్యటకుల సంఖ్య పెరగడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. తద్వారా భవిష్యత్ తరాలకూ మన చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని భద్రంగా అందించిన వాళ్లమవుతాం.
వ్యాసకర్త సెల్: 7989579428