calender_icon.png 29 September, 2024 | 9:09 AM

ఆఫ్గన్ చేతిలో సఫారీలు చిత్తు

22-09-2024 12:00:00 AM

రషీద్ పాంచ్ పటాకా

షార్జా: పసికూన ట్యాగ్‌ను చెరిపేసుకున్న అఫ్గానిస్థాన్ వరుసగా రెండో వన్డేలోనూ దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చింది. శుక్రవారం రాత్రి జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ 177 పరుగులు భారీ తేడాతో సఫారీలను చిత్తుగా ఓడించింది. తమ వన్డే చరిత్రలో ఆఫ్గన్ జట్టుకు ఏ జట్టుపై అయినా ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే అఫ్గానిస్థాన్ 2 సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. రహమనుల్లా గుర్బాజ్ (110 బంతుల్లో 105; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో చెలరేగి భారీ స్కోరుకు బాటలు వేయగా.. అజ్మతుల్లా (50 బంతుల్లో 86 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు.

రహమత్ (66 బంతుల్లో 50) రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి, బర్గర్, మార్క్రరమ్, ముల్డర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు రషీద్ ఖాన్ ధాటికి 34.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. కెప్టెన్ బవుమా (38) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఫ్గన్ బౌలర్ల ధాటికి ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు.  రషీద్ ఖాన్ ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.