టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో విండీస్‌పై ప్రొటీస్ జట్టు చెమటోడ్చి నెగ్గింది. వర్షం అంతరాయం మధ్య విండీస్ బౌలర్లు కడవరకు పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆఖర్లో మ్యాచ్ ఉత్కంఠగా మారినా సాధించాల్సిన పరుగులు ఎక్కువ లేకపోవడంతో.. ఒత్తిడిని అధిగమించిన సఫారీలు సులువుగా పని పూర్తిచేశారు. దీంతో గ్రూప్ నుంచి సౌతాఫ్రికా సెమీస్‌లో అడుగుపెట్టగా.. ఆతిథ్య వెస్టిండీస్ ఇంటిబాట పట్టింది. హ్యాట్రిక్ టైటిల్ సాధించాలనుకున్న విండీస్‌కు సొంతగడ్డపై నిరాశ ఎదురవగా.. చోకర్స్ ముద్ర చెరిపేసుకొని సఫారీలు చాంపియన్స్‌గా నిలుస్తారేమో చూడాలి!
నార్త్ సౌండ్: పొట్టి ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన సూపర్ పోరులో సౌతాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 3 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకంతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కైల్ మేయర్స్ (34 బంతుల్లో 35) పర్వాలేదనిపించాడు. సఫారీ బౌలర్లలో షంసీ 3 వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, మార్కరమ్, నోర్జే, రబాడ, కేశవ్ తలా ఒక వికెట్ తీశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 2 ఓవర్లలో 15 పరుగులతో ఆడుతున్న సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 17 ఓవర్లలో 123 పరుగులుగా లక్ష్యాన్ని నిర్దేశించారు. సౌతాఫ్రికా 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి గెలుపొందింది. ట్రిస్టన్ స్టబ్స్ (27 బంతుల్లో 29; 4 ఫోర్లు), క్లాసెన్ (10 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్సర్), మార్కో జాన్సెన్ (14 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్లలో చేజ్ 3 వికెట్లు తీయగా.. జోసెఫ్, రసెల్‌లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. తబ్రెయిజ్ షంసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు.