calender_icon.png 4 October, 2024 | 2:54 PM

సుద్దులు చెప్పే సద్దుల బతుకమ్మ మహా సంబురం

04-10-2024 12:00:00 AM

నేడు మూడో రోజు ‘ముద్దపప్పు బతుకమ్మ’ :

మానవతా విలువలకు పట్టం కట్టే పండుగ బతుకమ్మ. ఇది శాతవాహన రాజుల కాలం నుంచి ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతున్నది. వారి కాలంలో బతుకమ్మ పాటలు చాలావరకు ‘గౌరమ్మతో మొదలై గౌరమ్మతో’ పూర్తవుతాయి. ఈనాటికీ బతుకమ్మ పాటలలో అత్యధిక పాటలు ఇలాగే ముగుస్తాయి. ప్రధానంగా కాకతీయుల కాలం నాటినుంచి ఈ పండుగకు అత్యధిక ప్రాధాన్యం లభించింది.

రాణి రుద్రమదేవి హయాంలో బతుకమ్మ చాలా ప్రాచుర్యం పొందిందని చరిత్రకారుల అభిప్రాయం. ఆమె యాదవ రాజులపై విజయం సాధించి వచ్చాక పండుగను వీరోచితంగా, విజయానికి చిహ్నంగా ఎంతో గొప్పగా జరుపుకున్నట్టు తెలుస్తున్నది. 

పంచతత్తాలకు ప్రతీక

బతకమ్మ ఒక సామాజిక ఉత్సవం. ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చి గారాబంతో ఇంటిల్లిపాది ప్రేమాభిమానాలు కురిపించే పండుగ ఇది. గోపురంలా పేర్చిన ఈ బతుకమ్మ శ్రీ చక్రంలా కనిపిస్తుంది. పూలకు స్త్రీలకు అవినాభావ సంబంధం ఉంది. పూలు చాలా సున్నితంగా ఉంటాయి.

మానవ శరీరంలో షట్చక్రాలు ఉన్నట్టే మూలాధారం నుండి సహస్రారం వరకు బతుకమ్మలో కనిపిస్తాయి. దీనిలో పంచతత్వాలూ ఇమిడివుంటాయి. తంగేడు పువ్వు పృథ్వీతత్త్వానికి గుర్తు. దీనికి వ్యాపకం ఎక్కువ. గునుగు పువ్వుది వాయుతత్త్వం. కట్లపువ్వుకు రెండు రెక్కలుంటే మధ్య ఖాళీగా ఉంటుంది. ఇది ఆకాశతత్త్వం. ఎర్రటి మందార, రుద్రాక్ష పూలు అగ్నితత్త్వానికి ప్రతీక.

ముగ్గురమ్మల పాట

బతుకమ్మ పండుగలో ఆఖరి రోజు ‘సద్దుల బతుకమ్మ’. ఈరోజు ‘శ్రీ లక్ష్మీ నీ మహిమలు’ అనే పాట తప్పనిసరిగా ప్రతిచోట వినపడుతుంది. ఇందులో పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి ముగ్గురమ్మల ఆరాధన ఉంటుంది. తొలిరోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మకతో పండుగ ముగుస్తుంది. 

పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ

ఎనిమిది రోజులు ఒకేలాగ ఉన్న బతుకమ్మ  తొమ్మిదవ రోజున ముగ్ద మనోహరంగా ఉంటుంది. అష్టమినాటి దుర్గాష్టమిగా ‘సద్దుల బతుకమ్మ’ను జరుపుకుంటారు. ఈరోజు బతుకమ్మను ప్రతి ఒక్కరూ మిగిలిన 8 రోజులకన్నా పెద్దగా చేస్తారు. కాబట్టే, దీనికి ‘పెద్ద బతుకమ్మ’ అన్న పేరు స్థిరపడింది. సద్దుల బతుకమ్మ రోజు తెలంగాణ మొత్తం పూల సందోహమే. రుచికరమైన సద్దులకు తోడు పెద్దలు పిల్లలకు పాటల రూపంలో చెప్పే సుద్దులు (మంచిమాటలు) మరో విశేషం. 

చివరి రోజు ప్రతి ఇంట్లో రెండు బతుకమ్మలను పేరుస్తారు. తల్లి బతుకమ్మ పెద్దగా ఉంటే, పిల్ల బతుకమ్మను చిన్నగా పేరుస్తారు. పసుపుతో గౌరీమాతను తయారుచేసి బతుకమ్మను పేర్చి ఇంట్లోనే దేవస్థానంలో ఉంచి పూజిస్తారు. సాయంత్రం అందరూ తమ బతుకమ్మ లను ఒకచోట చేర్చి లయబద్ధంగా ఆడుతూ, పాడుతూ ఆఖరున చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ సమయంలో పసుపు గౌరమ్మలను నీటిలో వేసి ఓలలాడిస్తూ ఆడపిల్ల అత్తవారింటికి వెళ్లేటప్పుడు చెప్పే బుద్ధులు అనేకం చెప్పడం (పాటల రూపంలో) ఆనవాయితీ.

చెరువు గట్టుమీద ఆడి పాడి డప్పుల చప్పుడుతో నిమజ్జనానికి తీసుకెళ్తారు. ‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా. మల్లొచ్చే ఏడాది మళ్లీ రావమ్మా’ అని పాడుతూ బతుకమ్మలు వదిలిన పళ్ళాలలో కొన్ని నీటిని తీసుకొని అందులో పసుపు గౌరమ్మని తీసుకుంటారు. దానిని ఆ నీటిలో వేసి ‘శ్రీ లక్ష్మీ నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా’ అంటూ ఆ పసుపును మహిళలందరూ ఎలాంటి తేడాలు లేకుండా ఒకరి కొకరు ఇచ్చుకుంటారు. 

తొమ్మిది రకాల సద్దులు

సద్దుల బతుకమ్మ నాడు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా సద్దులను నైవేద్యంగా సమర్పిస్తారు. కొందరు మూడు రకాలు, ఇంకొందరు ఐదు రకాలు, చాలామంది తొమ్మిది రకాల నైవేద్యాలను చేస్తారు. ఈ నైవేద్యాలన్నీ ఎన్నో పోషక విలువలతో కూడుకొని ఆరోగ్యాన్నిస్తాయి.

వీటిని వాయినాల రూపంలో మహిళలు ఒకరి కొకరు పంచుకోవడం విశేషం. ‘హిమవంతుని ఇంట్లో పుట్టి, హిమవంతునింట్లో పెరిగి, పోయిరా బతకమ్మ పోయి రావమ్మా. పోయి నీ అత్తింట్లో బుద్ధి గలిగుండు..’ అనే పాట గౌరీదేవిని శంకరునికి అప్పగించే పాట. ఇది సద్దుల బతుకమ్మ రోజు విశేషంగా పాడే పాట. 

సద్దుల బతుకమ్మ రోజు పెరుగన్నం, చిత్రాన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వుల అన్నం ఇలా.. అన్నాన్ని భిన్నం చేసి నైవేద్యాలుగా సమర్పిస్తారు. బతుకమ్మను ఆడుకున్నన్ని రోజులు ఆడపిల్ల తన అత్తింటి కష్టాలను, అలసటలను మర్చిపోతుంది. చిన్ననాటి స్నేహితులతో ఆటలు ఆడి, పాటలు పాడి తిరిగి తన అత్తవారింటికి వెళ్లటమే ఈ సద్దుల బతుకమ్మ విశేషం. 

 వేముగంటి శుక్తిమతి