బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలను జరుపుకునేందుకు మహిళలు, యువతులు ఉత్సాహం చూపారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బతుకమ్మను సిద్ధం చేయడానికి కావలసిన వివిధ రకాల ఆకులు, పువ్వులను సేకరించడంలో నిమగ్నమయ్యారు. సద్దుల బతుకమ్మకు బెల్లంపల్లి ప్రధాన మార్కెట్ పూల విక్రయాలతో రద్దీగా మారింది. చామంతి, బంతి, తంగేడు, గూనుగు, తామెర, సీతమ్మ జడ , గుమ్మడి, బీర పూలతో పాటు వివిధ రకాల పూల విక్రయాలు జోరుగా సాగాయి. గ్రామీణ ప్రాంతాల రైతులు పూలను అమ్మడంలో పోటీపడ్డారు. మహిళలు ముందుగా పసుపు గౌరమ్మలను పూజించి సద్దుల బతుకమ్మలను తీరొక్క పూలతో పేర్చడంలో నిమగ్నమయ్యారు. అందంగా అలంకరించిన సద్దుల బతుకమ్మలకు నైవేద్యంగా పెట్టడానికి పిండితో సత్తులను తయారు చేసుకుని ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ ఆడేందుకు సిద్ధమయ్యారు.