calender_icon.png 10 October, 2024 | 10:41 PM

పటాన్‌చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు

10-10-2024 08:24:38 PM

పటాన్ చెరు, (విజయక్రాంతి): సద్దుల బతుకమ్మ సంబరాలు పటాన్ చెరులో అంబరాన్నంటాయి. పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో వేలాదిమంది మహిళలు తమ బతుకమ్మలతో హాజరయ్యారు. ప్రముఖ జానపద గాయని రేలారే రేలా గంగా ఆధ్వర్యంలోని బృంద సభ్యులు ఆలపించిన బతుకమ్మ గీతాలకు అనుగుణంగా మహిళలు బతుకమ్మ ఆడారు. బిత్తిరి సత్తి హాస్యం అందరినీ అలరించింది.  సాయంత్రం ఐదు గంటల ప్రారంభమైన సంబరాలు రాత్రి 11 గంటల వరకు నిర్విరామంగా కొనసాగాయి. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ... ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ..పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో పటాన్ చెరు పట్టణ ప్రజల సహకారం, మద్దతు అత్యంత కీలకమన్నారు. పటాన్ చెరు ప్రజలకు జీవితాంతం తమ కుటుంబం రుణపడి ఉంటుందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి ఆనందంలో పాలుపంచుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ పట్టణ  అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. 

అనంతరం ఉత్తమ బతుకమ్మలకు నగదు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి 25 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి 20 వేల రూపాయలు, తృతీయ బహుమతి  15 వేల రూపాయలును విజేతలకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమార్తె, కోడలు, మనుమరాల్లు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి అందరినీ త్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బల్దియా డిప్యూటీ కమిషనర్ సురేష్, పట్టణ పుర ప్రముఖులు, గూడెం కుటుంబ సభ్యులు,  మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.