పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలోని దివ్యాంగుల వైద్య నిర్ధారణ పరీక్షల కోసం జనవరి 8న మంగళవారం ఉదయం 11-35 గంటల నుండి మీ-సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.కాళిందిని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రొత్తగా సదరం సర్టిఫికేట్ కావాల్సిన వారు, తాత్కాలిక సదరం సర్టిఫికేట్ ఉన్నవారు రెన్యువల్ కొరకు దరఖాస్తులు చేసుకోవాలని, సదరం క్యాంప్ జనవరి 9న, జనవరి 23న పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో, జనవరి 17న, జనవరి 30న గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పెద్దపల్లి జనరల్ ఆసుపత్రిలో నిర్వహించు సదరన్ క్యాంపులో శారీరక అంగ వైకల్యం గలవారు, మానసిక అంగ వైకల్యం, బుద్ది మాన్యం ఉన్న వారు జనవరి 9న నిర్వహించు క్యాంప్ స్లాట్ కొరకు, దృష్టి లోపం, వినికిడి లోపం ఉన్నవారు జనవరి 23న నిర్వహించు క్యాంప్ స్లాట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో నిర్వహించు సదరన్ క్యాంపులో శారీరక అంగ వైకల్యం గలవారు, మానసిక అంగ వైకల్యం, బుద్ది మాన్యం ఉన్న వారు జనవరి 17న నిర్వహించు క్యాంప్ స్లాట్ కొరకు, దృష్టి లోపం, వినికిడి లోపం ఉన్నవారు జనవరి 30న నిర్వహించు క్యాంప్ స్లాట్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దివ్యాంగులు జనవరి 8న ఉదయం 11-35 గంటల నుండి మీ సేవా కేంద్రాల్లో స్లాట్ నమోదు చేసుకోవాలని, స్లాట్ బుకింగ్ అనంతరం మెడికల్ క్యాంపులకు వచ్చే సందర్భంలో దరఖాస్తుదారులు మీసేవ సదరం స్లాట్ బుకింగ్ రసీదుతో పాటు వికలాంగత్వ పరీక్షా కాపీ, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, వ్యక్తిగత మెడికల్ రిపోర్ట్ లను తీసుకొనిరావాలని అన్నారు. కొత్తగా సదరం సర్టిఫికెట్ కావాల్సిన వారు ఇంతకు మునుపే మీసేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసినట్లయితే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు డిపార్ట్మెంట్ ద్వారా క్యాంప్ యొక్క వివరాలు మెసేజ్ (ఎస్.ఎం.ఎస్.) ద్వారా వస్తాయని, అట్టి మొబైల్ ఫోను తప్పనిసరిగా క్యాంపుకు తీసుకొని రావాలని డి.ఆర్.డి.ఓ. ఆర్. ఎం.కాళిందిని ఆ ప్రకటనలో తెలిపారు.