- సదర్ ఉత్సవాలు రాష్ట్రానికే గర్వ కారణం
- నగర అభివృద్ధ్దికి యాదవులు అండగా నిలవాలి
- సదర్ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): సదర్ సమ్మేళనాన్ని ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నా రు. ఇందిరాపార్కు సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమా ర్, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘సదర్ అంటే యాదవుల ఖదర్’ అని అన్నారు. నగరంలో సదర్ ఉత్సవాలు నిర్వహించడం రాష్ట్రానికే గర్వకారణం అన్నారు. సదర్ ఉత్సవాలను ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధ్దిలో యాదవుల పాత్ర ఎవరూ కాదనలేనిదన్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో గతంలో యాదవ సోదరులు పశుగ్రాసాన్ని పెంచుకునే వారన్నారు.
ప్రస్తుతం మురికి కూపంగా మారిన మూసీకి పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. హైదరాబాద్ మహా నగర అభివృద్ధికి యాదవ సోదరులు ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ స్థానం నుంచి అంజన్ కుమార్ యాదవ్‌ను గెలిపించి ఉంటే ఈ రోజు మీవైపు నుంచి మంత్రిగా నిలబడి ఉండేవారన్నారు. అంజన్ అన్న ఓడిపోయినా.. యాదవ సోదరులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఆయన తనయుడు అనిల్ కుమార్
యాదవ్‌ను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపించిందన్నారు. యాదవులకు ఉన్నత పదవులు కల్పిస్తామ్న్నారు. యాదవుడైన శ్రీకృష్ణుడు కూడా ధర్మం వైపు నిలబడటం కారణంగానే కురుక్షేత్రంలో అధర్మం ఓడి.. ధర్మం గెలిచిందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.