calender_icon.png 24 December, 2024 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగరంలో సదర్ సంబురం

02-11-2024 01:27:26 AM

  1. ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు 
  2. అమీర్‌పేట, ఖైరతాబాద్, నాగోల్‌లో వేడుకలకు హాజరైన పలువురు ప్రముఖులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): నగరంలో సదర్ సంబురాలు ఆకట్టుకున్నాయి. ఏటా దీపావళి సందర్భంగా యాదవులు సదర్ ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఖైరతాబాద్, అమీర్‌పేట (శ్రీనగర్ కాలనీ రోడ్డు)లో శుక్రవారం నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ప్రజ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఖైరతాబాద్‌లో నవయుగ యాదవ సంఘం, చౌదరి యాద య్య, యాదవ్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్థానిక మహాగణపతి ప్రాంగణం నుంచి రైల్వే గేటు వరకు పెద్ద ఎత్తున సదర్ ఉత్సవాలను నిర్వహించారు. పంజాగుట్ట, సోమాజి గూడ, ఆనంద్ నగర్ కాలనీ, చింతల బస్తీ, దోమలగూడ, పురానాపూల్ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అలంకరించి తీసుకొచ్చిన దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఈ వేడుకల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

అమీర్‌పేట, నాగోల్‌లో.. 

అమీర్‌పేటలోని శ్రీనగర్ కాలనీ రోడ్డులో అమీర్‌పేట యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌తో పాటు మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, వీ హనుమంతరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా నాగోల్‌లో నిర్వహించిన సదర్ సంబురాల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.