calender_icon.png 18 November, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషాదం నింపిన స్నేహితుల రోజు

05-08-2024 12:59:40 AM

  1. పార్లేజీ బిస్కెట్ కంపెనీ ఉద్యోగుల పార్టీలో అపశృతి 
  2. రాత్రి ఫాంహౌజ్‌లో ఎంజాయ్ చేసి.. తెల్లారేసరికి శవమై తేలిన సహోద్యోగి 
  3. మరో కారు ప్రమాద ఘటనలో ముగ్గురి మృతి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): స్నేహితుల దినోత్సవం సందర్భంగా తోటి మిత్రులతో కలిసి పార్టీ చేసుకోవడానికి వెళ్లిన వ్యక్తి స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పదంగా మృతిచెంది ఉన్న ఘటన మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు  తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జిలాకుంటకి చెందిన సందీప్‌రెడ్డి(29) ప్రస్తుతం కాప్రాలో నివాసముం టూ పార్లెజీ బిస్కెట్ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం స్నేహితుల దినోత్సవం కావడంతో కంపెనీలోని సేల్స్ మేనేజర్ పార్టీ ఇస్తానని చెప్పడంతో కంపెనీలో పనిచేసే 12 మంది కలిసి యాదగిరిప ల్లిలోని ఫాంహౌజ్‌లో పార్టీ చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

ఈ క్రమంలో శనివారం సాయంత్రం అందరూ ఫాంహౌజ్‌కు చేరకున్నారు. రాత్రంతా మద్యం సేవించి, పార్టీని ఫుల్ ఎంజాయ్ చేసి నిద్రపోయారు. తెల్లవారుజామున లేచి చూసే సరికి సందీప్‌రెడ్డి స్విమ్మింగ్ పూల్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. దీంతో తోటి మిత్రులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు సందీప్‌రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతికి గల కారణాలు, సందీప్‌రెడ్డికి తోటి ఉద్యోగులతో ఏమైనా పాత గొడవలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఫాంహౌజ్‌లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఫాంహౌజ్‌లపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

చెట్టును ఢీకొట్టిన కారు..

నాగర్‌కర్నూల్, ఆగస్టు 4 (విజయక్రాంతి): స్నేహితుల దినోత్సవం రోజును ఎంజాయ్ చేసేందుకు కారులో శ్రీశైలం వెళ్తున్న వారిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. అమ్రాబాద్ సీఐ శంకర్ నాయక్ తెలిసిన వివరాల ప్రకారం..హైదబాద్‌లోని బొల్లారం ప్రాంతానికి చెందిన మాచర్ల కిషన్ కన్నయ్య(21)  మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. స్నేహితుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు శ్రీశైలం వెళ్లే ప్లాన్ వేసుకొని తనతో పాటు మెకానిక్ షెడ్డులో పనిచేసే సాయిప్రకాష్(20), కావలి రమేష్(21), గణేష్‌తో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు.

అర్థ్దరాత్రి ఒంటిగంట ప్రాంతంలో నల్లమల అటవీ ప్రాంతంలో వటవర్లపల్లి గ్రామ శివారులో మద్యం మత్తులో కారు నడుపుతున్న డ్రైవర్ అతివేగంగా చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గణేష్ మినహా అందరూ అక్కడిక క్కడే మృతి చెందారు. గలపెంట ఎస్‌ఐ వీరమళ్లు సంఘటనా స్థలంలో గాయపడిన గణేష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.