calender_icon.png 7 October, 2024 | 6:52 AM

బంగ్లా బలి..

07-10-2024 12:54:47 AM

మరోమారు బంగ్లాపులుల్ని బలి చేశారు. ఏ ముహూర్తాన టీమిండియా గడ్డ మీద అడుగుపెట్టారో కానీ ఇప్పటి వరకు విజయం రుచి చూడని బంగ్లాకు టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో కూడా నిరాశే ఎదురైంది. బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన బంగ్లా.. భారత బ్యాటర్లు ఊచకోత కోస్తుంటే బంగ్లా బౌలర్లు నివ్వెరపోయి చూస్తుండిపోయారు.

  1. తొలి టీ20లో గెలిచిన సూర్య సేన
  2. రెచ్చిపోయిన బ్యాటర్లు
  3. చిన్నబోయిన 128 పరుగుల లక్ష్యం

గ్వాలియర్: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 128 పరుగుల లక్ష్యాన్ని సూర్య సేన 11.5 ఓవర్లలోనే చేధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు బంగ్లాను 127 పరుగులకే ఆలౌట్ చేసింది.

రెండో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టులో ఓపెనర్లు రావడం.. రావడంతోనే బంగ్లా బౌలర్లపై దాడికి దిగారు. దీంతో పవర్‌ప్లేలో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. వికెట్లు పడ్డా కానీ భారత బ్యాటర్లు నెమ్మదించలేదు. వచ్చిన వారు వచ్చినట్లు బ్యాటుకు పని చెప్పడంతో బంగ్లా బౌలర్లు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ ఉండిపోయారు.

మన బ్యాటర్ల దెబ్బకు బంగ్లా కెప్టెన్ ఎంత మంది బౌలర్లను మార్చినా కానీ ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో చేసేదేం లేక బంగ్లా కెప్టెన్ శాంటో పాత బౌలర్లతోనే ఓవర్స్ కంప్లీట్ చేశాడు. అర్షదీప్ సింగ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 అక్టోబర్ 9న జరగనుంది. 

ఇద్దరి ఆరంగ్రేటం... 

టీమిండియా తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో ఆరంగ్రేటం చేశారు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డితో పాటుగా.. ఐపీఎల్‌లో రాకెట్ స్పీడ్‌తో బంతులు విసిరి ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారిన స్పీడ్ స్టర్ మయాంక్ యాదవ్ ఇద్దరూ క్యాప్ అందుకున్నారు.

మయాంక్ యాదవ్‌కు మురళీ కార్తిక్ క్యాప్ అందజేయగా.. నితీశ్ రెడ్డికి పార్థివ్ పటేల్ క్యాప్ అందించాడు. బౌలింగ్‌లో మయాంక్ యాదవ్ 4 ఓవర్లు వేసి ఒక మెయిడెన్‌తో పాటు ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. ఇక 2 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చిన నితీశ్ రెడ్డి బ్యాటింగ్‌లో తన మార్కు చూపెట్టాడు. కేవలం ౧౫ బంతుల్లోనే ౧౬ పరుగులు చేసి తన సత్తా చాటాడు. 

 పాండ్య ప్రతాపం

వ్యక్తిగత కారణాలతో పాటు గత ఐపీఎల్‌లో కూడా సరైన ప్రదర్శన చేయలేక ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్య ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన పాండ్య ఇక బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. కేవలం 16 బంతుల్లోనే 2 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.  పాండ్య దెబ్బకు ఇండియా 11.5 ఓవర్లలోనే ఘన విజయం సాధించింది. 

86 మ్యాచ్‌ల తర్వాత.. 

వరుణ్ చక్రవర్తి చివరి సారిగా భారత్ తరఫున 2021లో అంతర్జాతీయ టీ20 ఆడాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ 86 టీ20లు ఆడగా వరుణ్ చక్రవర్తి ఆ మ్యాచులు మిస్ అయ్యాడు. తొలి టీ20లో ఆడిన వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 3 వికెట్లు నేలకూల్చి బంగ్లా నడ్డివిరిచాడు.

స్కోరు వివరాలు

బంగ్లాదేశ్: పర్వేజ్ హొస్సేన్ ఇమాన్ (బౌల్డ్) అర్షదీప్ సింగ్ 8, లిట్టన్ దాస్ (సి) రింకూ సింగ్ (బి) అర్షదీప్ సింగ్ 4, శాంటో (సి అండ్ బి) సుందర్ 27, హృదోయ్ (సి) పాండ్య (బి) వరుణ్ చక్రవర్తి 12, మహ్మదుల్లా (సి) సుందర్ (బి) మయాంక్ యాదవ్ 1, జకీర్ అలీ  (బౌల్డ్) వరుణ్ చక్రవర్తి 8, మిరాజ్  (నాటౌట్) 35, రిషాద్ (సి) పాండ్య (బి) వరుణ్ చక్రవర్తి 11, అహ్మద్ రనౌట్ 12, ఇస్లాం (బౌల్డ్) పాండ్య 0, ముస్తాఫిజుర్ (బౌల్డ్) అర్షదీప్ సింగ్ 1, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 19.5 ఓవర్లలో 127/10.

భారత్: సంజూ శాంసన్ (సి) హొస్సేన్ (బి) మెహదీ హసన్ 29, అభిషేక్ శర్మ (రనౌట్) 16, సూర్యకుమార్ యాదవ్ (సి) జకీర్ అలీ (బి) ముస్తాఫిజుర్ 29, నితీశ్ కుమార్ రెడ్డి (నాటౌట్) 16, పాండ్య (నాటౌట్) 39, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 11.5 ఓవర్లలో 132/3.

వికెట్ల పతనం: 1-25, 2-64, 3-80 బౌలింగ్: ఇస్లాం 2-0-17-0, టస్కిన్ అహ్మద్ 2.5-0-44-0, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 3-0-36-1, రిషాద్ 3-0-26-0, మిరాజ్ 1-0-7-1.