calender_icon.png 24 January, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో సబలెంక

24-01-2025 01:22:31 AM

* సెమీస్‌లో బడోసాపై విజయం

* స్వియాటెక్‌కు కీస్ షాక్ 

* ఆస్ట్రేలియన్ ఓపెన్ 

మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్ అరీనా సబలెంక ఫైనల్లో అడుగపెట్టింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సబలెంక సెమీస్‌లో పౌలా బడోసాపై సునాయాస విజయం సాధించి వరుసగా మూడోసారి టైటిల్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరో సెమీస్‌లో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగిన రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌కు మాడిసన్ కీస్ షాకిచ్చి తుది పోరుకు అర్హత సాధించింది. శనివారం జరగనున్న ఫైనల్లో మాడిసన్ కీస్ బెలారస్ సుందరి సబలెంకతో అమీతుమీకి సిద్ధమయ్యింది. 

సబలెంక సాఫీగా..

రాడ్ లేవర్ ఎరీనా వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీస్‌లో సబలెంక 6 6 పౌలా బడోసా (స్పెయిన్)పై సునాయాస విజయాన్ని అందుకుంది. గంటా 26 నిమిషాల పాటు సాగిన పోరులో సబలెంకా పూర్తిగా ఆధిపత్యం కనబరిచింది. మ్యాచ్‌లో సబలెంక 2 ఏస్‌లతో పాటు 32 విన్నర్లు సంధించింది.

17 గ్రౌండ్‌స్ట్రోక్ షాట్లతో అలరించిన సబలెంక మూడు వ్యాలీ షాట్స్ కూడా కొట్టింది. 11 విన్నర్లు మాత్రమే సంధించిన బడోసా 15 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ఇప్పటికే 2022, 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన సబలెంక ముచ్చటగా మూడో టైటిల్ అందుకునేందుకు అడుగుదూరంలో ఉంది.

మాడిసన్ కేక..

మరో సెమీస్‌లో మాడిసన్ కీస్ (అమెరికా) 5 6 7 (10/8)తో పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్‌ను ఓడించింది. 2 గంటల 35 నిమిషాల పాటు సాగిన పోరు ఉత్కంఠగా సాగింది. తొలి సెట్‌ను కోల్పోయిన కీస్ రెండో సెట్‌ను మాత్రం అద్భుత ఆటతీరుతో కైవసం చేసుకుంది. ఇక మూడో సెట్‌లో ఒక్కో పాయింట్ కోసం ఇరువురు కొదమ సింహాల్లా తలపడ్డారు.

అయితే సెట్ టై బ్రేక్‌కు దారి తీయగా.. స్వియాటెక్‌పై థ్రిల్లింగ్ విజయాన్ని అందుకున్న మాడిసన్ కీస్ కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన స్వియాటెక్ ఏడు డబుల్ ఫాల్ట్స్, 40 అనవసర తప్పిదాలు చేసింది. ఇప్పటివరకు ఫ్రెంచ్ ఓపెన్‌ను నాలుగుసార్లు, యూఎస్ ఓపెన్‌ను ఒకసారి నెగ్గిన స్వియాటెక్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం రెండోసారి కూడా సెమీస్‌కే పరిమితమైంది.

జొకోవిచ్ x జ్వెరెవ్

నేడు జరగనున్న పురుషుల సింగిల్స్ సెమీస్‌లో జొకోవిచ్‌తో జ్వెరెవ్ అమీతుమీకి సిద్ధమయ్యాడు. కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్ మంచి జోష్‌లో కనిపిస్తుండగా.. జ్వెరెవ్ మాత్రం అతికష్టం మీద సెమీస్‌లో అడుగుపెట్టాడు. గ్రాండ్‌స్లామ్స్ టోర్నీల్లో జ్వెరెవ్‌తో తలపడిన రెండు సందర్భాల్లోనూ జొకోవిచ్‌దే విజయం. ముఖాముఖి పోరులోనూ జొకో 8 జ్వెరెవ్‌పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నాడు. మరో సెమీస్‌లో జానిక్ సిన్నర్‌తో బెన్ షెల్టన్ తలపడనున్నారు.