calender_icon.png 29 October, 2024 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుబంధు రికవరీ వేగవంతం

14-07-2024 12:56:10 AM

  1. అనర్హుల జాబితాను సిద్ధం చేస్తున్న వ్యవసాయశాఖ 
  2. వెంచర్లపై పొందిన వారి నుంచి నగదు వసూలు
  3. 12 విడుతలో రూ. 26వేల కోట్లు సొమ్ము వృథా

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): గత ప్రభుత్వం వ్యవసాయేతర భూములకు రైతుబంధు పంపిణీ చేసి ప్రజాధనం వృథా చేయడంతో ఆ డబ్బును రికవరీ చేసేందుకు రేవంత్ సర్కార్ నడుం బిగించింది. పంటసాగు చేసిన రైతులు పెట్టుబడి సాయానికి అర్హులని, వెంచర్లు చేసి ధరణిలో పాస్ పుస్తకాలు పొందిన యాజమానులు అనర్హులని, వారిని గుర్తించి నగదు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు 12 విడుతల్లో ఎకరానికి రూ.10 వేలు చొప్పున రెండు పంటలకు పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాలో జమ చేసింది.

కానీ పంటసాగు చేసే రైతులతో పాటు ధరణి నుంచి పాస్‌పుస్తకాలు పొందిన వారందరికీ రైతుబంధు పంపిణీ చేసింది. దీనిని గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుని, రైతు భరోసా పేరుతో సాయం అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి ఈనెల 10 నుంచి రైతుల నుంచి అభిప్రాయ సేకరణ ప్రారంభించింది. ఇందులో ప్రధానంగా రైతులు వెంచర్లు, రోడ్లు, గుట్టలు, వ్యాపార కార్యకలపాలు వినియోగించే భూములను రైతు భరోసా జాబితా నుంచి తొలగించాలని సూచనలు చేయడంతో ప్రభుత్వం ఆ దిశగా ప్లాన్ చేస్తుంది.

అందులో ముందుగా వెంచర్లు పేరుమీద నగదు పొందిన యాజమానులు గుర్తిస్తుంది. ఇటీవల రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారం గ్రామానికి యాదగిరెడ్డి 33 ఎకరాలు వెంచర్ చేసి అమ్మేశాడు. కానీ భూమికి సంబంధించిన పాస్ పుస్తకాలు అతనికి రావడంతో రూ.16 లక్షల వరకు రైతుబంధు సొమ్ము పొందాడు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం తీసుకున్న నగదు వాపసు ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ చుట్టపక్కల గ్రామాలతో పాటు మండల, మున్సిపాలిటీలో వెంచర్లు చేసి అమ్మి, వ్యవసాయ రైతు గా రైతుబంధు దర్జాగా తీసుకున్నారు.

వారి వివరాలను గ్రామాలవారీగా స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఎన్ని ఎకరాలు, ఎంతమంది రైతులు, ఎంత నగదు దుర్వినియోగమైందో గుర్తించి ప్రభుత్వానికి ఐదారు రోజుల్లో నివేదికలు ఇచ్చేం దుకు సిద్ధం చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. కేసీఆర్ పాలనలో రూ.26వేల కోట్ల ధనం అనర్హులకు చేరిందని గుర్తించి దానిని రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు రెండ్రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసి అక్రమంగా రైతుబంధు పొందిన వారి జాబితా ను త్వరగా పంపించాలని పేర్కొంది. రాష్ట్రం లో 68.99 లక్షల మంది రైతులకు 1.52 కోట్ల ఎకరాల భూమి ఉన్నట్లు రెవె న్యూ రికార్డుల వెల్లడిస్తున్నాయి. వీటిలో 73 శా తం 2.47 ఎకరాల రైతుల, 17 శాతం చిన్న రైతులు 2.48 నుంచి 4.94 ఎకరాలు,  ఒక శాతం మాత్రమే పెద్ద రైతులు 24.78 ఎకరాలు కలిగిఉన్నారు. 53 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందినవారు ఒక్కొక్కరు 13 శాతం, ఇతర వర్గాలు 21శాతం ఉన్నారు. 

10 శాతం సాగు చేయని భూములే  

ధరణిలో నమోదైన భూముల్లో 8 నుంచి 10 శాతం వరకు బీడు, వెంచర్లు, రోడ్లు, గుట్ట లు సాగులేని భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ సమీ ప ప్రాంతాలతో పాటు జిల్లాలు, మండల కేంద్రాల్లో గత పాతికేళ్ల  నుంచి వెంచర్లు చేసి విక్రయాలు చేశారు. ధరణిలో వారికే పట్టా పాసుపుస్తకాలు రావడంతో దర్జాగా రైతుబంధు పొందుతున్నారు. ఇళ్ల నిర్మాణాలు జరిగినవి సుమారు 3 లక్షల ఎకరాల వరకు ఉంటాయని, గుట్టలు, రహదారులు, పడావు భూములు, అక్రమంగా పట్టా చేసిన ప్రభుత్వ భూములు, ఫారెస్టు భూములు 3.50 లక్షల ఎకరాల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.