- వ్యవసాయేతర భూమిపై ఇచ్చిన రైతు బంధు డబ్బు రికవరీ
- మేడ్చల్ జిల్లా పోచారం గ్రామానికి చెందిన రైతు యాదగిరిరెడ్డికి నోటీసులు
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రైతుబంధుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధు వాపస్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. గురువారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం గ్రామానికి చెందిన రైతు యాదగిరిరెడ్డికి ఈ మేరకు నోటీసులు జారీచేసింది. భూమిని వెంచర్లు చేసినా రైతుబంధు సొమ్ము పొందడంతో, ఆ డబ్బును రికవరీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
రైతుబంధు పథకం కింద తీసుకున్న రూ. 16లక్షలు తిరిగి చెల్లించాలని ఆ నోటీసుల సారాంశం. గతంలో తన 33 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి యాదగిరిరెడ్డి అమ్మినట్లు ప్రభుత్వం గుర్తించింది. 33 ఎకరాల ప్లాట్ల భూమిపై యాదగిరిరెడ్డికి రూ. 16 లక్షలు రైతుబంధు చెల్లించినట్లు తేల్చింది. ఇంకా ఎంతమంది అనర్హులు రైతుబంధు తీసుకున్నారో గుర్తిస్తున్నామని, ఐదారు రోజుల్లో మిగతావారికి కూడా నోటీసులు పంపించి సొమ్మును రికవరీ చేసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.
రైతుబంధు అక్రమాలు ఇలా వెలుగులోకి..
- మేడ్చల్ జిల్లా నుంచే కొరడా
నేటి నుంచి నోటీసులు జారీచేయనున్న అధికారులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం పోచారం గ్రామంలో సర్వే నంబర్ 38, 39, 40లో గతంలో అమ్మిన 33 ఎకరాల భూమికి మోత్కుపల్లి యాదగిరిరెడ్డి పట్టాదారు పాసు పుస్తకం పొంది ఐదేళ్లుగా రైతు బంధు సాయం పొందుతున్నాడు. ఈ విషయాన్ని సామాజిక కార్యకర్త, ధరణి భూ సమస్యల వేదిక కన్వీనర్ మన్నె నర్సింహారెడ్డి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ జరిపిన అధికారులు 1981లోనే నాన్ అగ్రికల్చర్ (శారదానగర్ లేఅవుట్) ల్యాండ్‌గా మారిన 33 ఎకరాలకు మోత్కుపల్లి యాదగిరిరెడ్డి రైతుబంధు ద్వారా రూ. 16.80 లక్షల సాయం పొందినట్టు గుర్తించారు. ఆ సొమ్మును తక్షణమే రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ జూన్ 29న ఘట్కేసర్ తహసీల్దార్‌కు డీ1/1115/2024 లేఖ రాశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు వివరించారు. అక్రమంగా రైతుబంధు పొందిన యాదగిరిరెడ్డికి తహసీల్దార్ శుక్రవారం నోటీసులు జారీ చేయనున్నారు.
ధరణి రాకతో
ధరణి రాకతో ఉన్నతాధికారులు ప్రలోభాలకు లోనై 40 ఏళ్ల క్రితం వెంచర్లుగా మారిన భూమికి పట్టాదారు పాసు పుస్తకాలను జారీచేశారు. దీంతో రికార్డుల్లో అవి వ్యవసాయ భూములుగానే ఉన్నాయి. వారందరికీ రైతుబంధు సాయం అందింది. ఇందులో నాలా కన్వర్షన్ చేయకుండానే కేవలం పంచాయతీ అనుమతితో వేల ఎకరాలను లే అవుట్‌లు చేసి అమ్మేసిన దాఖలాలు ఉన్నాయి. వీటన్నింటికీ రికార్డుల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ కావడంతో రైతుబంధు పథకానికి అర్హులు అయ్యారు. దీంతో ఏటా వీరందరికీ రైతు బంధు సాయం లక్షల్లో అందింది. ధరణి పోర్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఈసీ డాటా సరిపోలిస్తే ఇలాంటి భూముల వివరాలు స్పష్టంగా తెలిసిపోతాయని మన్నె నర్సింహారెడ్డి అంటున్నారు. ఈ తరహాలో అత్యధికంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, వరంగల్ జిల్లాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
హ్యాపీ హోమ్స్‌పై చర్యలు శూన్యం
మేడ్చల్ మండలం రావల్ కోల్, షాజాదిగూడ, సోమారం గ్రామాల్లో నేచర్ 1, నేచర్ 2, అర్బన్ టౌన్ పేరిట హ్యాపీ హోమ్స్ కనస్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 24 ఏళ్ల క్రితమే వెంచర్లు వేసి అమ్మేసింది. కానీ, ధరణి పోర్టల్‌లో రైతుల పేర్లు రావడంతో తిరిగి పట్టా పాసు పుస్తకాలు పొందారు. వీటిని రద్దు చేయాలంటూ హోమ్స్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్, సీసీఎల్‌ఏకు 2020లోనే అనేక మార్లు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన అప్పటి కలెక్టర్ హరీష్ సీసీఎల్‌ఏకు లేఖ ద్వారా వివరించారు. రావల్‌కోల్‌లో 196, 195, 177, 174, 179, 192, 175, 194 సర్వే నంబర్లలో 12.25 ఎకరాలు, షాజాదిగూడలో 76, 77, 72, 70, 71, 73 సర్వే నంబర్లలో 11.29 ఎకరాలు, సోమారంలో 65, 62, 63, 86, 72, 81 సర్వే నంబర్లలో 12.34 ఎకరాల్లో నాలా కన్వర్షన్ చేయకుండానే లేఅవుట్ చేసి అమ్మేసినట్టుగా గుర్తించారు. ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చేసిన ఫిర్యాదుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.