హైదరాబాద్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లా అమిస్తామూర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం రైతు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈసందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... రైతులు వాతావరణానికి అనుగుణంగా పంటలు పండించాలని, రైతులంటే అందరికీ దానం చేసే జాతి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మహబూబ్ నగర్ కు జీవనాడి అని, పాలమూరుకు వలసల జిల్లా అనే పేరు ఉందని తెలిపారు. ఇకపై పాలమూరుకు వేరే ప్రాంతాల నుంచి వలసలు రావాలి కానీ, ఇక్కడి నుంచి వలస వెళ్లకూడదన్నారు. రైతుకు ఎన్ని బాధలున్నాయో ప్రభుత్వానికి అన్ని బాధలున్నాయని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో మహబూబ్ నగర్ లోని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఇరిగేషన్ ప్రణాళిక రూపొందించాలని, రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే జిల్లా మహబూబ్ నగర్ కావాలని సూచించారు.
బోనస్ తీసుకున్న రైతులు ఆనందంగా ఉన్నారని, ఈ బోనస్ వల్ల కష్టపడ్డ రైతుకు మాత్రమే ఫలితం దక్కుతోందని పేర్కొన్నారు. రైతుబంధు కంటే బోనస్సే బాగుందని, కొందరు రైతులు బోనస్సే ఇవ్వాలంటున్నారని చెప్పారు. బోనస్ వల్ల రైతుకు రూ.12 నుంచి 15 వేలు వస్తున్నాయి. దీంతో తెలంగాణ రైతుల అనుభవాల ప్రకారం వారికి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తుమ్మల తెలిపారు. రైతులు తమకు ఏ పథకం మంచిదో చెబితే.. ఆ పథకాలే కొనసాగిస్తామని, గత ప్రభుత్వం మాదిరిగానే అన్ని చేస్తామని.. కల్లబొల్లి కబుర్లు చెప్పి, రైతులను ఆశల పల్లకిలో ఊరేగించమని మంత్రి విమర్శించారు. న్యాయంగా, ధర్మంగా ప్రభుత్వానికి ఎంత ఓపిక ఉందో.. అంత చేస్తామని తుమ్మల చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.