30న ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరసన
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): రైతుల సమస్యలను ఆయుధంగా చేసుకొని కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటానికి బీజేపీ సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలు, హామీల్లో ప్రధానమైన రైతుల సమస్యలపై రాష్ట్ర కాషాయ దళం గురిపెట్టింది. అం దుకే ఈ నెల 30న ఇందిరా పార్క్ వద్ద రైతు దీక్ష పేరిట ఆందోళనకు సిద్ధమైంది.
రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య ప్రజాప్రతినిధులతోపాటు పార్టీ ముఖ్య నేతలంతా ఈ దీక్షకు హాజరుకానున్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 వరకు నేతలు దీక్షలో కూర్చోనున్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.
రైతు రుణ మాఫీ విషయంలో తెలంగాణ సర్కార్ అన్నదాతలను మోసం చేసిందని బీజేపీ పేర్కొంటుంది. రైతు రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరం కాగా, ఇప్పటి వరకు కేవలం రూ.17వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. రూ. 2 లక్షల లోపు మాఫీ అనేక మంది రైతులకు జరగలేదని పేర్కొంటున్నా రు.
దీనిపై సీఎం ఒకమాట, మంత్రు లు మరోమాట మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అందుకే రైతు దీక్ష ద్వారా రైతుల సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.