calender_icon.png 11 January, 2025 | 9:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెమీస్‌లో రిబాకినా

11-07-2024 12:10:00 AM

  1. క్వార్టర్స్‌లో స్వితోలినాపై విజయం   
  2. జొకోవిచ్, క్రెజికోవా ముందంజ

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మాజీ చాంపియన్ ఎలినా రిబాకినా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. కెరీర్‌లో రెండో వింబుల్డన్ టైటిల్ సాధించేందుకు కజకిస్థాన్ చిన్నది మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. మరో సింగిల్స్‌లో ఒస్టపెంకపై విజయంతో క్రెజికోవా సెమీస్‌లో అడుగుపెట్టింది. పురుషుల సింగిల్స్‌లో సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్‌కు వాకోవర్ లభించగా.. డిఫెండింగ్ చాంపియన్ అల్కారాజ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు.

లండన్: సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ వింబుల్డన్ టోర్నీలో నాలుగో సీడ్ ఎలినా రిబాకినా సెమీఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రిబాకినా 6-3, 6-2తో ఎలినా స్వితోలినా (ఉక్రెయిన్) పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. గంట పాటు సాగిన మ్యాచ్‌లో రిబాకినా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. మ్యాచ్‌లో 7 ఏస్‌లు సంధించిన రిబాకినా 28 విన్నర్లు కొట్టగా.. స్వితోలినా ఒక ఏస్‌కు మాత్రమే పరిమితమై 4 డబుల్‌పాల్ట్‌లు చేసింది.

రెండేళ్ల క్రితం వింబుల్డన్ నెగ్గిన రిబాకినాకు ఆల్ ఇంగ్లండ్ క్లబ్‌లో మంచి రికార్డు ఉంది. గ్రాస్ కోర్టుపై 21 మ్యాచ్‌లాడిన రిబాకినా 19-2తో విజయాల సంఖ్యను మరింత మెరుగుపరుచుకుంది. మరో సింగిల్స్ క్వార్టర్స్‌లో 31వ సీడ్ బార్బోరా క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 6-4, 7-6 (7/4)తో జెలెనా ఒస్టపెంకపై విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. గంటకు పైగా సాగిన మ్యాచ్‌లో 5 ఏస్‌లు సంధించిన క్రెజికోవా 27 విన్నర్లు కొట్టింది. 5 డబుల్ ఫాల్ట్స్ చేసిన ఒస్టపెంక 35 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

తొలి సెమీస్‌లో క్రెజికోవాతో రిబాకినా, రెండో సెమీస్‌లో వెకిక్‌తో జాస్మిన్ పవోలిని అమీతుమీ తేల్చుకోనున్నారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. 9వ సీడ్ అలెక్స్ డీ మునార్ గాయంతో వైదొలగడంతో జొకోకు వాకోవర్ లభించింది. మరో క్వార్టర్స్‌లో ముసెట్టి ౩-౬, ౭-౬ (౭/౫), ౬-౨, ౩-౬, ౬-౧తో టేలర్ ఫ్రిట్జ్‌పై గెలిచి సెమీస్ చేరాడు. డిఫెండింగ్ చాంపియన్‌అల్కరాజ్ (స్పెయిన్) సెమీస్‌లో అడుగుపెట్టాడు. క్వార్టర్స్‌లో అల్కరాజ్ 5-7, 6-4, 6-2, 6-2తో టామీ పాల్ (అమెరికా)పై విజయం సాధించాడు. సెమీస్‌లో మెద్వెదెవ్‌తో అల్కరాజ్ తలపడనున్నాడు.