14-04-2025 11:33:42 PM
34 మంది మృతి, 117 మందికి గాయాలు..
ఉక్రెయిన్‌కు రావాలని ట్రంప్‌కు జెలెన్ స్కీ వినతి..
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణి దాడులకు పాల్పడింది. సుమీ నగరంలో ఆదివారం రెండు బాలిస్టిక్ మిసైల్స్‌తో జరిపిన దాడిలో 34 మంది మృత్యువాత పడగా.. 117 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఉదయం 10.15 గంటల సమయంలో జనావాసాలున్న ప్రాంతంలో పామ్ సండే వేడుకల్లో పాల్గొన్న వారిపై క్షిపణులు పడ్డాయి. వీటి పేలుడు తీవ్రతకు ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుని ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది.
కాగా రష్యా దాడులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మండిపడ్డారు. రష్యాను ఉగ్రవాదిగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తున్నారంటూ రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకున్న మరునాడే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. అంతకుముందు జెలెన్ స్కీ.. సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉక్రెయిన్‌కు రావాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.