13-03-2025 01:28:26 AM
ఇంకా ఆమోదించాల్సిన రష్యా
పుతిన్ అంగీకారంపై ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్
వాషింగ్టన్, మార్చి 12: రష్యా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఒప్పందానికి ఉక్రెయిన్ ఇప్పటికే ఆమోదం తెలపగా.. రష్యా మాత్రమే ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అంగీకరించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా ఓకే చెబుతారని ఆశిస్తున్నా. యుద్ధం వల్ల అనేక మంది అమాయకులు చనిపోతున్నారు.
యుద్ధాన్ని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది. అందుకోసం కాల్పుల విరమణ అనేది చాలా ముఖ్యం. పుతిన్ దీనికి ఒప్పుకోకపోతే ఇంకా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతారు. జెలెన్‌స్కీతో మరోమారు చర్చలు జరిపేందుకు ఆయన్ను వైట్‌హౌస్‌కు పిలుస్తా’ అని ట్రంప్ తెలిపారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఇప్పటికే చర్చలు జరగ్గా.. ఆ చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. సమావేశంలో మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. రష్యా యుద్ధం ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ప్రతిపాదించగా.. కీవ్ అందుకు ఓకే చెప్పింది. ఇంకా రష్యా తన వైఖరి తెలియాలి.