calender_icon.png 12 March, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హడావుడి నియామకం

20-02-2025 12:00:00 AM

కేంద్ర ఎన్నికల కమిషనర్(సీఈసీ) నియామకంపై కేంద్ర ప్రభు త్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం పలు అనుమానాల కు తావిస్తోంది. వాస్తవానికి  రాజీవ్‌కుమార్ పదవీ విరమణ చేశాక కమిషన్‌లో సీనియర్ సభ్యుడైన జ్ఞానేష్ కుమార్ తాత్కాలిక సీఈసీ అయి ఉండేవారు. అయితే ప్రభుత్వం మాత్రం  ముందుగానే ఆయన నియామకానికి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించడం ఇప్పుడు వివాదంగా పరి ణమించింది.

గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఎంపిక చేసే ప్యానెల్‌లో ప్రధాని, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ ర్తి సభ్యులుగా ఉండేవారు. అయినా మొన్నటిదాకా కేంద్రం నిర్ణయించిన వారే సీఈసీ అయ్యేవారు. దీంతో దేశ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటి ఈ వ్యవస్థ ఓ ప్రభుత్వ వ్యవస్థగా మారడం సరికాదని, అందుకే ఉన్నతన్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం ఉన్నట్లుగా సీఈసీ, కమిషన్ ఇతర సభ్యుల ఎంపికకు కూడా కొలీజియం లాంటి వ్యవ స్థ ఉండాలనే వాదన మొదలైంది.

సీఈసీ నియామక ప్రక్రియను ప్రభు త్వం మితిమీరిన జోక్యానికి దూరంగా ఉంచాలంటూ 2023లోనే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కూడా చేసింది. అంతేకాదు, ప్రధాని, ప్రతిపక్ష నాయకు డు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

దీంతో రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా కమిటీనుంచి సీజేఐని తప్పిస్తూ, ఆయన స్థానంలో ప్రధాని సూచించిన కేంద్రమంత్రిని సభ్యుడిగా చేరుస్తూ  అదే ఏడాది కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టప్రకారం నియామకాలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.

జ్ఞానేష్ కుమార్ ఈ కొత్త చట్టం కింద చేపట్టిన తొలి సీఈసీ నియామకం కావడం గమనా ర్హం. అయితే ఈ కొత్తచట్టం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందని, ఈసీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఎక్కువయ్యేలా ఉందని, అన్నిటికీ మించి ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని పేర్కొంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై రెండు రోజుల్లో విచారణ జరగాల్సి ఉండగా కొత్త సీఈసీని హడావుడిగా నియమించడంతోనే వివాదం తలెత్తింది.

జ్ఞానేష్ కుమార్ సమర్థతను కానీ, ఆయనను సీఈసీగా నియమించడాన్ని కానీ ఎవరూ తప్పుబట్టడం లేదు. సీఈసీ ఎంపికపై ప్రభుత్వం హడావుడిగా అర్ధరాత్రి ప్రకటన చేయడాన్ని మాత్రమే లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఎంపిక కమిటీలో సభ్యుడు కూడా అయిన రాహుల్ గాంధీ సైతం తప్పు బడుతున్నారు.

ఇప్పటికిప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలో నూ ఎన్నికలు జరగాల్సి లేదు. అలాంటప్పుడు కొత్త ప్రక్రియ చట్టబద్ధతపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే దాకా వేచి ఉండడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. తీర్పు త్వరగా ఇవ్వాలని ప్రభుత్వం కోర్టును కోరవచ్చు. కానీ ప్రభుత్వానికి ఆ చాన్స్ తీసుకోవడం ఇష్టం లేదనిపిస్తోంది.

అందుకే కొత్త చట్టం కింద జ్ఞ్ఞానేష్ కుమార్ నియామకానికి ఆమోదముద్ర పడేలా చూసుకుం ది. కాగా బుధవారం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు  ఈ కేసు సత్వర విచారణ అత్యవసరమని, ఎందుకంటే ఇప్పటికే సీఈసీ, మరో ఈసీ సభ్యుడి నియామకం జరిగిందని పిటిషనర్లలో ఒకరైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తరఫు సీనియర్ నాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు.

వాదనలు వినిపించడానికి ఎక్కువ సమ యం పట్టదని కూడా చెప్పారు. అయితే కేసు తదుపరి విచారణను వచ్చే నెల 19కి వాయిదా వేసిన జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం అంతకు ముందు సమయం ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచారణ వాయి దా వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అంతకు ముందుకోరగాప్రశాంత్ భూషణ్ తీవ్ర అభ్యంతరం చెప్పారు.

దీంతో ఈ వివాదం ఇప్పుడు పార్లమెంటులో ప్రతిధ్వనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి గతంలో టీఎన్ శేషన్ సీఈసీగా స్వతంత్రంగా వ్యవహరించడం మొద లు పెట్టినప్పటినుంచీ ఎన్నికల కమిషన్ వార్తల్లో నిలుస్తూనే ఉంది.