calender_icon.png 21 September, 2024 | 10:01 AM

రూ.10వేల కోట్లు.. హైదరాబాద్ రియల్టీకి ఊతమిచ్చేనా!

28-07-2024 02:30:00 AM

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 27 (విజయక్రాంతి): హైదరాబాద్ మహా నగర పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడంతోపాటు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు వరకు ప్రభుత్వం అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే నగరాభివృద్ధి కోసం ప్రభుత్వం 2024 వార్షిక బడ్జెట్‌లో రూ.10వేల కోట్లను కేటాయించింది. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే నగరానికి అత్యధిక నిధులు కేటాయించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ప్రధానంగా మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి పనులతో పాటు మౌలిక వసతులను కల్పించాలనే లక్ష్యంతో నగరానికి ఎక్కువ నిధులు కేటాయించింది. నగర పరిధిలో విస్తరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వం దృష్టి సారించడంతో ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన రూ.10 వేల కోట్లు రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిచ్చేనా అనే చర్చ రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలలో జరుగుతుంది. 

శాటిలైట్ టౌన్‌షిప్‌లు విస్తరించే చాన్స్

నగరంలో ఐటీ, పారిశ్రామిక రంగా ల్లో ఉపాధి అవకాశాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తున్న కార్యాలయాలకు దగ్గరగా నివాసం ఉంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని నగరం చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ప్రభు త్వం భావిస్తుంది. ఈ టౌన్‌షిప్‌లలో ఉద్యోగులతోపాటు పేద, మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో, అన్ని రకాల మౌలిక వసతులతో నివాస గృహాల నిర్మాణాలను అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో విపత్తుల నిర్వహణకు ఒక ఏకీకృత సంస్థ ఏర్పాటు చేసి, జీహెఎంసీ సహా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలు దీని పరిధిలోకి తెచ్చేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ప్రభుత్వం.

ఈ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యత హైదరాబాద్ విపత్తు నివారణ, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) కు అప్పగించనున్నారు. ఇక మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా సుమారు 110 చదరపు కిలోమీటర్ల పట్టణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, నదీ తీర ప్రాంతంలో కొత్త వాణిజ్య, నివాస కేంద్రాలను ఏర్పాటుకు కృషి చేయడంతో పాటు పాత హెరిటేజ్ ప్రాంతాలకు కొత్త సొబగులు అద్దాలని తెలంగాణ సర్కార్ సమాయుత్తం అవుతోంది. ఈ క్రమంలోనే నగర శివారు ప్రాంతాల్లోని ఐటీ, పారిశ్రామిక వాడలకు సమీపంలో చేపట్టబోయే రియల్ ప్రాజెక్టులకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు.  

మెరుగైన ప్రజా రవాణా..

హైదరాబాద్ నగరం మీదుగా అనేక జాతీయ రహదారులు ఇప్పటికే విస్తరించి ఉండటంతోపాటు నగరంలో ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్ వంటి మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ ఉంది. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా స్టాటటిక్స్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌లో భాగంగా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ అండర్‌పాస్‌లు, ఫ్లుఓవర్లు, ఆర్‌యూబీల వంటి నిర్మాణాలను చేపట్టడంతోపాటు నగరం మెడలో హారంలాగా నగర శివారు ప్రాంతాలను, తెలంగాణ నలుదిక్కుల నుంచి నగరానికి చేరుకునే జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ ఉన్న ఔగర్ రింగు రోడ్డు మెరుగైన రవాణా వ్యవస్థ నగరంలో ఉంది. అయితే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు, మియాపూర్ నుంచి పటాన్ చెరుకు మెట్రో సౌకర్యాన్ని పొడిగించాలని ప్రభుత్వం డీపీఆర్ ను సిద్దం చేస్తోంది. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాలను కోర్ అర్బన్ రీజియన్‌గా గుర్తించడంతోపాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

నాగోలు, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట మెట్రో స్టేషన్లను ఇంటర్ చేంజ్ స్టేషన్లగా అభివృద్ధి చేయనున్నారు. ఈ రెండు రూట్లలో మెట్రోను విస్తరించాలని నిర్ణయించడంతో పాటు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో హైదరాబాద్ నలు దిక్కుల మళ్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటుందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. నగరంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మెట్రో రైల్ విస్తరణ చేపడతామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది.

78.4 కిలో మీటర్ల పొడవున్న 5 అదనపు మెట్రో కారిడార్లను రూ.24,042 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్టు సీఎం ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ ప్రతిపాదిత మెట్రో నిర్మాణం పూర్తయితే 20 నిముషాల్లోపే శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే నగరం చుట్టూ ఉన్న రోడ్లను మెట్రో అనురసంధానం అవుతుంది. దీంతో మెట్రో విస్తరించే సమీప ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మెజార్టీ ప్రజలు ఆసక్తి చూపే అవకాశం ఉంది. 

శంకర్‌పల్లి, చేవెళ్లలో రియల్ జోరు

 హైదరాబాద్ మెట్రో రెండో దశలో దూరంతోపాటు అంచనా వ్యయం భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించారు. గతంలో మొత్తం 5 కారిడార్లలో 70 కిలోమీటర్ల దూరం ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కిలోమీటర్లు పెరిగి 78.4 కిలోమీటర్లకు చేరింది. దీంతో మొత్తం మెట్రో రైల్ విస్తరణ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.24,042 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు హైటెక్ సిటీ సమీపంలోని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అమెరికా కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్ల మేర మార్గాన్ని కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పుడు మరికొంత విస్తరించి కోకాపేటలోని నియోపోలిస్ వరకు మెట్రో ప్రాజెక్టును చేపట్టాలని రేవత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

దీంతో సుమారు 3.3 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం పెరిగింది. తాజాగా మెట్రోరైల్ విస్తరణతో ప్రతిపాదనలతో శంకర్‌పల్లి, చేవెళ్ల వరకు రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రవాణా సౌకర్యం మెగుగైతే కాస్త దూరమైనా ఇళ్లు కొనేందుకు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారు ఆసక్తి చూపుతారని రియల్ రంగ నిపుణులు చెప్తున్నారు. కోకాపేట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరిస్తుండటంతో ఆ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడంతో పాటు రియల్ రంగం మళ్లీ ఊపందుకుంటుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు.